జీడీకే–11గనిలో కార్మికుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

జీడీకే–11గనిలో కార్మికుడికి గాయాలు

Sep 8 2026 12:35 AM | Updated on Sep 8 2026 12:35 AM

గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్‌–1 పరిధిలోని జీడీకే–11 గనిలో మొదటిషిఫ్టులో గని పైకప్పు కూలి కోల్‌కట్టర్‌ కార్మికుడు సార్ల సాగర్‌ గాయపడ్డాడు. గనిలోని 50వ లెవల్‌, 13వ డీప్‌, 3వ సీమ్‌లో పైకప్పు సేఫ్టీ పనిచేస్తున్న క్రమంలో పెద్దబండ కూలి కొంతబాగం నడుం, కాళ్లపై పడటంతో కుడికాలుకు గాయాలయ్యాయి. వెంటనే సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మాదాసి రాంమూర్తి కార్మికుడిని పరామర్శించారు.

లారీ డ్రైవర్‌ ఆత్మహత్య

కోరుట్లరూరల్‌: పట్టణంలోని అల్లమయ్యగుట్టకాలనీకి చెందిన లారీ డ్రైవర్‌ ఈర్నాల రాజేశ్‌ (48)ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజేశ్‌ కొంతకాలంగా ఫిట్స్‌వ్యాధితో బాధ పడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. రాజేశ్‌కు భార్య భాగ్య, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భాగ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉపాధ్యాయురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు

జగిత్యాలక్రైం: మల్లాపూర్‌ మండలంలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అసభ్యకరంగా సైగలు చేస్తూ ఇబ్బందికి గురిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు ఆగుల్ల సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లికి చెందిన ఆగుల్ల సత్యనారాయణ ప్రస్తుతం రాయికల్‌ మండలం భూపతిపూర్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయురాలిని వెంబడిస్తూ.. అసభ్యంగా సైగలు చేస్తూ ఇబ్బందులకు గురిచేయగా గతంలో ఇతడిపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో అతడిని విధుల నుంచి సస్పెండ్‌ కూడా చేశారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ సదరు ఉపాధ్యాయురాలికి అసభ్యకరంగా మెసేజ్‌లు పంపుతూ పెళ్లి చేసుకోవాలని వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. సత్యనారాయణను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement