వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సీవీ ఆనంద్
సిరిసిల్ల: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఈనెల 14 నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాల ఎస్పీలు, సీపీలు, పోలీస్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బందోబస్తు, భద్రత చర్యలపై దిశనిర్దేశం చేశారు. మండపాల వివరాలు, ఊరేగింపు మార్గాలు, సమయం వంటి సమాచారం సేకరించాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాలు, వివాదాస్పద ప్రదేశాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీజేలు, బాణసంచా వినియోగంపై నిబంధనలు అమలు చేయాలన్నారు. ప్రతీ మండపం వద్ద కనీసం ముగ్గురు వలంటీర్లు రేయింబవళ్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, జియోట్యాగింగ్ చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై స్టేషన్ స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. గణేశ్ శోభాయాత్రలో ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఎస్పీలు కె.నాగేంద్రచారి, జి.వెంకటేశ్వర్లు, సీఐ మధుకర్, ఆర్‌ఐ సురేష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


