ఇది ఫామ్‌హౌస్ పాలన కాదు ప్రజాపాలన
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: బీఆర్‌ఎస్ బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. గత వెయ్యిరోజులుగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫల మయ్యారని పేర్కొంటూ రాజీనామా చేయాలని కోరుతూ గురువారం వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 500 మీటర్ల భారీ ఫ్లెక్సీతో ర్యాలీ తీశారు. విప్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను రద్దు చేయకుండా, కొత్తగా 120కి పైగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కల్వకుంట్ల కుటుంబమన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన తర్వాత రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారని, వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే ఈ భారీ ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు పాల్గొన్నారు.


