బాధ్యత మరిచిన సిబ్బంది.. ఆవేదనలో రోగులు జిల్లా ఆస్పత్రిలో నిర్లక్ష్యపు నీడలు కార్పొరేట్ స్థాయి నుంచి అధ్వాన స్థితికి.. జిల్లా ఆస్పత్రిలో పేదలకు అందని వైద్యసేవలు
సిరిసిల్లటౌన్: నిన్న.. మొన్నటి వరకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే సిరిసిల్ల ధర్మాస్పత్రిలో నేడు పరిస్థితులు అధ్వానస్థితికి పడిపోయాయి. అత్యవసర స్థితిలో వచ్చే పేదలపై సిబ్బంది తీరు ఇబ్బందిగా ఉంటోంది. అధికారుల పట్టింపులేమితో జిల్లా ఆస్పత్రి నిర్లక్ష్యానికి కేరాఫ్‌గా మారింది. కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్యం అందుతుందని ఆశతో వచ్చే నిరుపేదలకు కొద్దిరోజులుగా నిరాశే ఎదురవుతోంది. రోగులపై కొందరు డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సిబ్బంది బాధ్యత లేమి..
వివిధ వ్యాధులతో వచ్చే రోగులు, ప్రమాదాల బారిన పడి వచ్చే క్షతగాత్రులపై కొంతమంది సిబ్బంది బాధ్యతగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం జాప్యం చేయడం, అచేతన స్థితిలో వచ్చే వారిని కనీసం స్ట్రెచర్‌పై కూడా తీసుకురావడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నిత్యం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రోగులు ఆస్పత్రికి వస్తుంటారు. వీరిని పట్టించుకునే వారు కరువయ్యారని ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు చెబుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఓపీ కౌంటర్ల దగ్గర గంటల తరబడి వేచి చూసి వార్డుల్లో చేరిన రోగులను సకాలంలో పరీక్షించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక విధుల్లో ఉండాల్సిన కొందరు సిబ్బంది సమయపాలన పాటించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
ఆధునిక పరికరాలు ఉన్నా..
దశాబ్దకాలంగా జిల్లా ఆస్పత్రిలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక వైద్య పరికరాలు, మందులను అందుబాటులో ఉంచింది. ఇక్కడికి జిల్లాలోని మారుమూల గ్రామాలతోపాటు పక్క జిల్లాల నుంచి చికిత్స కోసం వస్తున్నారు. వారిపై సిబ్బంది అలసత్వం పెరిగిపోవడం వివాదాలకు తావిస్తోంది. గర్భిణులపై నర్సింగ్ సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సాయిగణేశ్
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
ప్రతీ రోజు వందల సంఖ్యలో వచ్చే రోగులకు సకల వసతులు, మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రోగులపై సిబ్బంది బాధ్యత, స్నేహపూర్వకంగా మెదిలేలా ఆదేశాలిచ్చాం. కొన్ని సందర్భాలలో రోగుల సహాయకులు కూడా సిబ్బందికి సహకరించాల్సి ఉంటుంది.
– డాక్టర్ సుమన్ మోహన్‌రావు,
ఆర్‌ఎంవో
ఇటీవల జరిగిన సంఘటనలు
బైక్ పై నుంచి పడి గాయాలతో వారం క్రితం సిరిసిల్ల వాసి చంద్రకాంత్ ఆస్పత్రికి వెళ్లగా డ్యూటీలో ఉన్న సిబ్బంది డ్రెస్సింగ్ చేసే టైము కాలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చికిత్స చేయకుండా మూడు గంటలు నిలబెట్టుకున్నారు.
ఇల్లంతకుంట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి హర్షిణికి వారం క్రితం పాప పుట్టింది. రెండు రోజులపాటు ఆరోగ్యంగా ఉన్న శిశువు టీకా వేయగా జ్వరం వచ్చి మృతిచెందింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి చనిపోయినట్లు బాధితులు ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు.
జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన డెలివరీ బాయ్‌గా పనిచేసే ఎనగంటి సాయిగణేశ్ గత గురువారం రాత్రి బైక్‌పై నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో కాలర్‌బోన్ విరిగిపోగా.. జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. బాధితుడికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. అయితే నాలుగు రోజులు గడిచినా ఆపరేషన్ చేయకపోగా, సిబ్బంది సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టారు. కాలర్‌బోన్ విరిగిన తనను కనీసం స్ట్రెచ్చర్‌పై కూడా తీసుకెళ్లకుండా నడిపిస్తూ ఎక్స్‌రే తదితర టెస్టులకు తిప్పి చివరికి ఐదో రోజు ఆపరేషన్ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితం కడుపునొప్పితో మల్లారెడ్డిపేట నుంచి రాజు అడ్మిట్ అయ్యాడు. రాత్రి వేళలో ఆస్పత్రి బంగ్లాపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్తుండగా చనిపోయాడు. ఆస్పత్రిలో సరైన సెక్యూరిటీ ఉంటే రాజు బతికి ఉండేవాడని విమర్శలు వెల్లువెత్తాయి.


