● ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాలకే అవకాశం ● ఆన్‌లైన్‌కు ఈనెల 10 వరకు గడువు ● 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు
చందుర్తి(వేములవాడ): రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు ఇస్తానన్న క్వింటాల్‌కు రూ.500 బోనస్‌పై సవాలక్ష కొర్రీలు పెడుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాలు సన్నాలకే బోనస్ వర్తిస్తుందని ప్రకటించింది. అంతేకాకుండా ఏ సన్నరకాలు సాగుచేస్తున్నారో ఆన్‌లైన్ చేయాల్సిందే. అప్పుడు బోనస్ వర్తిస్తుందని ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో రైతులు ఆగమాగమవుతున్నారు. అన్నదాతల ఆన్‌లైన్ కష్టాలపై ఫోకస్.
1.72 లక్షల ఎకరాల్లో వరిసాగు
ఈ వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 1.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయాధికారుల అంచనా వేయగా 12 వేల ఎకరాల వరకు తగ్గిందని భావిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో రైతులు సన్నవడ్లు సాగు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాలను 90వేల ఎకరాల్లో సాగు చేసి ఉంటారని అధికారుల అంచనా. మరో 50 వేల ఎకరాల్లో ఇతర సన్నాలు, మిగతా 32 వేల ఎకరాల్లో దొడ్డు రకపు వడ్లు సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
బోనస్‌పై నిబంధనలు
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్నరకాలకు బోనస్ అందించేందుకు పలు నిబంధనలు విధిస్తుంది. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వంగడాలు ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎం 1638, బీపీటీ 5204, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరాం, డబ్ల్యూజీఎల్44, కేఎన్‌ఎం 7715 సాగు చేయాలని సూచించింది. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని మరో నిబంధన పెట్టింది. దీంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ వద్దకు వెళ్లి బిల్లు, ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్ పుస్తకంతో వివరాలు నమోదు చేయించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ను ఈనెల 10లోపు చేసుకోవాలనే గడువు విధించింది.
ఏఈవోల వద్ద సెల్ఫ్ డిక్లరేషన్
రైతులు గత సీజన్‌లో తమ పంట పొలాల్లో సాగు చేసుకున్న విత్తనాలనే ఇప్పుడు సాగులోకి వాడుకున్న, పరిశోధన స్థానాల నుంచి కొనుగోలు చేసి వాడుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే రైతులు సాగుచేసిన పంటలకు ఎరువులను యాప్‌ల ద్వారా బుకింగ్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న రైతులు పంటల వివరాలు ఆన్‌లైన్ చేయించుకునేందుకు పడుతున్న తిప్పలు అన్నీ.. ఇన్నీ కావు.


