రోడ్డుపై వెళ్లేదెలా? | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపై వెళ్లేదెలా?

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

అధ్వాన్నంగా అంతర్‌ జిల్లా రహదారి

శాంతినగర్‌–చీమన్‌పల్లి మధ్య బురదమయం

వేములవాడ–సిరికొండ రోడ్డుకు మోక్షం కరువు

సీఆర్‌ఎఫ్‌లో నిధులున్నా సాగని పనులు

ఇది వీర్నపల్లి మండలం శాంతినగర్‌ శివారులోని రోడ్డు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లి–శాంతినగర్‌ మధ్య రోడ్డు బురదమయంగా మారి జర్రునజారుతుంది. చిన్నపాటి వర్షం పడినా ప్రయాణం ప్రాణాంతకంగా మారుతుంది. ఎర్రనిమట్టిని పోసి రోడ్డు పనులు చేపట్టి మధ్యలో వదిలేయడంతో ఇలా బురదతో నిండిపోయింది. నిజానికి ఇది రాజన్నసిరిసిల్ల–నిజామాబాద్‌ జిల్లాల మధ్య అటవీ ప్రాంతం గుండా వెళ్లే అంతర్‌ జిల్లా రహదారి. వేములవాడ–సిరికొండ(వీఎస్‌) రోడ్డు. 56 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో శాంతినగర్‌–చీమన్‌పల్లి మధ్య రోడ్డు ఇలా బురదమయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్‌ జిల్లాలను కలిపే రోడ్డు అధ్వానంగా మారింది. ఎర్రమట్టి పోయడంతో చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారుతుంది. సిరిసిల్ల నుంచి సిరికొండకు వెళ్లే రోడ్డు ద్వారా దూరభారం తగ్గుతుంది. జిల్లా ప్రజలు నిజామాబాద్‌కు వెళ్లేందుకు ఇది దగ్గరిదారి. డబుల్‌ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడం.. ఎర్రమట్టి పోయడంతో చిరుజల్లులకే బురదగా మారుతుంది. ఈ రోడ్డు దుస్థితిపై గ్రౌండ్‌ రిపోర్టు.

దగ్గరిదారి.. బురదమయం

సిరిసిల్ల, వేములవాడ పట్టణ ప్రజలు నిజామాబాద్‌ జిల్లాకు కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌ మీదుగా ఒక మార్గం, కామారెడ్డి, డిచ్‌పల్లి మీదుగా మరో మార్గం ద్వారా వెళ్లాలి. కానీ సిరిసిల్ల నుంచి సిరికొండ మార్గం చాలా దగ్గరి దారి. సిరికొండ వరకు డబుల్‌ రోడ్డు పూర్తయితే.. నేరుగా భీంగల్‌, ఆర్మూర్‌ మీదుగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు. సిరికొండ, దర్పల్లి, ఇందల్‌వాయి మీదుగా మరో మార్గంలోనూ వెళ్లే అవకాశం ఉంది. కానీ సిరికొండ, వీర్నపల్లి మండలాల పరిధిలోని రోడ్డు బాగా లేకపోవడంతో వాహనదారులు జంకుతున్నారు. కోనరావుపేట మండలం మరిమడ్ల, వీర్నపల్లి మండలం శాంతినగర్‌, సిరికొండ మండలం తాటిపల్లి, చీమన్‌పల్లి మధ్య ఉన్న 8 కిలోమీటర్ల రోడ్డును విస్తరించి డబుల్‌ రోడ్డుగా మార్చితే.. రెండు జిల్లాల మధ్య దూరభారం తప్పుతుంది.

వేములవాడ–సిరికొండ రోడ్డుకు మోక్షమేదీ?

వేములవాడ–సిరికొండ మధ్య 56 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి భవనాల శాఖ మూడు దశాబ్దాలుగా ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే వేములవాడ నుంచి హన్మాజిపేట వరకు డబుల్‌ రోడ్డు ఉంది. ఇక్కడి నుంచి బావుసాయిపేట శివారు వరకు 10.6 కిలోమీటర్ల డబుల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్లు సెంట్రల్‌ రోడ్‌ ఫడ్స్‌(సీఆర్‌ఎఫ్‌)లో మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఇటీవల శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్టులను విస్తరించారు. కానీ రోడ్డు వెడల్పు చేసే పనులు మొదలు కాలేదు. ఈ రోడ్డు పూర్తయితే.. రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. బావుసాయిపేట నుంచి వట్టిమల్ల శివారు వరకు, మరిమడ్ల నుంచి తాటిపల్లి సరిహద్దు వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

ఇది కోనరావుపేట మండలం మరిమడ్ల శివారులోని అహ్మద్‌హుస్సేన్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి మధ్య రోడ్డు. వేములవాడ–సిరికొండ రోడ్డులోని ఓ భాగం. ఇక్కడ కూడా డబుల్‌ రోడ్డు నిర్మించకపోవడంతో ఎప్పుడో వేసిన తారు చెదిరిపోయింది. దీనిపై ప్రయాణించేవారు రెండు జిల్లాల సరిహద్దుల్లోని రోడ్డును చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాల అధికారులు పట్టించుకోకపోవడంతో శివారు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement