● డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
సిరిసిల్ల: నేత్రదానాన్ని ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. 41వ నేత్రదాన పక్షంలో భాగంగా శనివారం సిరిసిల్ల శివారులోని రంగినేని ట్రస్ట్ వృద్ధాశ్రమం, తంగళ్లపల్లి శివారులోని లగిశెట్టి, మండెపల్లిలోని వృద్ధాశ్రమాల్లో కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ కంటి చూపు ఒకసారి పోతే తిరిగిరాదని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశంలో 12 లక్షల మంది కార్నియా ఆంధత్వంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, ఆయన సతీమణి సోవియాగాంధీ తొలిసారి 1986 ఆగష్టు 25న నేత్రదాన వాగ్దానం చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. అప్పటి నుంచి ఏటా నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏ వయస్సు వారైనా మరణించిన ఆరు గంటల్లోగా నేత్రదానం చేయవచ్చన్నారు. జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం అధికారి నయీమ్ జహా, వైద్య సిబ్బంది రాజేందర్, నిఖిల్, నాగరాజు, ఓల్డ్ ఏజ్ హోమ్ కోఆర్డినేటర్ మమత పాల్గొన్నారు.


