రీ సర్వేపై రైతులకు సమాచారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేపై రైతులకు సమాచారం ఇవ్వాలి

Aug 28 2026 11:41 PM | Updated on Aug 28 2026 11:41 PM

● కొత్తపేటలో పరిశీలించిన అదనపు కలెక్టర్‌ నగేశ్‌ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి వైభవంగా గిరి ప్రదక్షిణ తుంపర వాన

● కొత్తపేటలో పరిశీలించిన అదనపు కలెక్టర్‌ నగేశ్‌

బోయినపల్లి(చొప్పదండి): ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భూ భారతి కింద భూముల రీ సర్వే పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఆదేశించారు. మండలంలోని కొత్తపేటలో రోవర్‌ యంత్రంతో భూముల రీసర్వే పనులు కొనసాగుతుండగా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామంలో సర్వేపై రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. భూముల వివరాలు పకడ్బందీ గా నమోదు చేయాలన్నారు. అనంతరం సర్వే యంత్రంతో వివరాలు ఎలా తీసుకుంటున్నారో పరిశీలించారు. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ షరీఫ్‌ మొహియొద్దీన్‌, సర్పంచ్‌ ఇల్లెందుల రాజు, సర్వేయర్లు మధుసూదన్‌, విజయేందర్‌ పాల్గొన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు.

ఆధారం చూపి సర్వే చేయండి

వేములవాడరూరల్‌: తమకు ఆధారం చూపించి భూములు సర్వే చేయాలని మండలంలోని మర్రిపల్లికి చెందిన దళిత రైతులు రెవెన్యూ అధికారులకు విన్నవించారు. మర్రిపల్లి శివారులో సర్వేనంబర్లు 743, 744, 748లో దాదాపు యాభై ఏళ్లుగా ఆ భూముల్లో గ్రామానికి చెందిన దళిత రైతులు సాగుచేసుకుంటున్నారు. ఆ భూమిలో వేములవాడ రాజన్న ఆలయ గోశాల, రైతు విజ్ఞాన కేంద్రం కోసం 71 ఎకరాలు సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు శుక్రవారం వెళ్లారు. విషయం తెలుసుకున్న పలువురు రైతులు అక్కడికి వెళ్లి అధికారులకు తమ గోడు విన్నవించారు. గతంలో ఇచ్చిన పట్టాపాస్‌బుక్‌లు తీసుకొస్తే న్యాయం చేస్తానని తహసీల్దార్‌ అబుబాకర్‌ రైతులకు సూచించారు. పాస్‌బుక్‌లు ఉన్న రైతులకు అన్యాయం చేయబోమని మరో ప్రాంతంలో స్థలం చూపిస్తామని హామీ ఇచ్చారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని అనంతగిరి ముత్యాల పోచమ్మ తల్లిని శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ముత్యాల పోచమ్మ ఆలయం వద్ద మినీ ఫంక్షన్‌హాల్‌, సీసీరోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ కోసం నిధులు మంజూరు చేయాలని ఆలయ చైర్మన్‌ కోలాపురి అంతగిరి కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈవో మారుతీరావు, సర్పంచ్‌ అరికాల నవీన్‌కుమార్‌ మంత్రిని సత్కరించారు. ఇల్లంతకుంట ప్యాక్స్‌ డైరెక్టర్‌ ఒగ్గు రమేశ్‌, సీఐ నాగేశ్వరరావు, ఎస్సై ఉపేందర్‌చారి తదితరులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో శుక్రవారం గిరిప్రదక్షిణ నిర్వహించారు. ‘గోవిందా.. గోవిందా..’ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సర్పంచ్‌ మోర లక్ష్మీరాజం మాట్లాడుతూ ప్రతీ పౌర్ణమి నాడు గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాపె ల్లి ఆనందం, గజభీంకార్‌ రాజన్న, మచ్చ శ్రీని వాస్‌, సామల గణష్‌, రెడ్డి పర్శరాములు, ఎగుర్ల ప్రశాంత్‌, కోడం పృథ్వీ పాల్గొన్నారు.

సిరిసిల్ల: జిల్లాలోని తొమ్మిది మండలాల్లో శుక్రవారం కొద్ది పాటి తుంపర వర్షం కురిసింది. వేములవాడలో 1.9 మిల్లీమీటర్లు, సిరిసిల్ల, వీర్నపల్లి మండలాల్లో 1.7, రుద్రంగిలో 0.8, చందుర్తి, వేములవాడ రూరల్‌లో 0.3, కోనరావుపేటలో 0.8, ముస్తాబాద్‌లో 0.3, ఇల్లంతకుంటలో 0.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement