ఇల్లంతకుంట(మానకొండూర్): భూభారతి కింద చేపట్టే భూముల రీసర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. మండలంలోని సిరికొండలో భూభారతి కింద రోవర్ యంత్రంతో భూముల రీసర్వే పనులు కొనసాగుతుండగా గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, ఇల్లంతకుంట తహసీల్దార్ ఆర్.సురేష్, జిల్లా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రావణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ వసుమతి, సర్పంచ్ గొడుగు విఠల్ పాల్గొన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): దత్త ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల రూపకల్పనకు కృషి చేస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని వరదవెల్లి గుట్టపై ఉన్న గురు దత్తాత్రేయస్వామి ఆలయానికి బోట్ సౌకర్యాన్ని గురువారం పునర్ ప్రారంభించారు. బోట్‌లో ప్రయాణించి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. తహసీల్దార్ షరీఫ్ మోహియొద్దీన్, ప్యాక్స్, ఏఎంసీ చైర్మన్లు సురేందర్‌రెడ్డి, ఎల్లేశ్‌యాదవ్, సెస్ డైరెక్టర్ సుధాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సువీన్‌యాదవ్, సర్పంచులు మహేశ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భూమిలోకి పంపించాలని డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ కోరారు. మండలంలోని మద్దికుంటలో వీబీజీరామ్‌జీలో నిర్మిస్తున్న ఫామ్‌పాండ్, మొక్కల పెంపకం పనులను గురువారం పరిశీలించారు. మద్దికుంటలో మొక్కలు నాటిన తర్వాత, గూడెంలో విద్యార్థుల యూనిఫామ్స్ తయారీని పరిశీలించారు. కొలతల మేరకు చక్కగా కుట్టాలని, నిర్ణీత సమయంలో అందించాలని సూచించారు. ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో ఆనంద్‌మోహన్, సర్పంచ్ రాజమల్లవ్వ పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, చైర్‌పర్సన్ జింద కళకు గురువారం వినతిపత్రం అందించి మాట్లాడారు. కార్మికులకు బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనె, గ్లౌజులు అందించాలన్నారు. 60 ఏళ్లు పైబడ్డ వారి స్థానాల్లో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలివ్వాలని కోరారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాసర్ల శంకర్, పట్టణ అధ్యక్షుడు ఏల్పుల బాలయ్య, నాయకులు నర్మెట బాబాకిషన్, బత్తుల దేవరాజు, గడ్డం విజయ, నర్మెట ఉమ, రెడ్డిమల్ల మమత, మారుపాక లక్ష్మి, నక్క ఎల్లవ్వ పాల్గొన్నారు.
ఏఈవోల ఇన్‌సర్వీస్ డిప్యూటేషన్ కొనసాగించాలి
సిరిసిల్ల: వ్యవసాయ శాఖలో డిప్లొమా ఏఈవోల ఇన్‌సర్వీస్ బీఎస్సీ డిప్యూటేషన్ పాలసీని కొనసాగించాలని కోరుతూ జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగంకు గురువారం వినతిపత్రం అందించారు. ఇన్‌సర్వీస్ డిప్యూటేషన్ విధానం కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రం అందించారు. జిల్లా ఏఈవోల అసోసియేషన్ ప్రతినిధి లక్ష్మణ్, శ్రీశైలం, నరేశ్, గంగ, సహజ, రమేశ్, సాయి పాల్గొన్నారు.


