పర్యావరణ పరి‘రక్షా’
ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: ప్రకృతి ప్రేమికులు రాఖీ పౌర్ణమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ప్రిన్సిపాల్ పద్మావతి, పర్యావరణ ప్రేమికుడు దుంపెన రమేశ్ మొక్కలు నాటారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వాసరవేణి పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
చెట్లకు రాఖీ కట్టిన బ్లెస్సీ
ఐ రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, వనజీవి హరిత అవార్డు గ్రహీత కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన చిన్నారి ప్రకృతి బ్లెస్సీ చెట్లకు రాఖీలు కట్టారు. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ప్రకృతి బ్లెస్సీ, పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి ప్రకాశ్ కుమార్తె. తండ్రి అడుగుజాడల్లో నడుస్తుంది. బద్దెనపల్లి గురుకులంలో ఏడో తరగతి చదువుతోంది. బ్లెస్సీ రెండు రోజులు శ్రమించి 100 కాగితపు రాఖీలను చెట్లకు కట్టింది.
సిరిసిల్లటౌన్: రక్షాబంధన్ వేడుకల సందర్భంగా సిరిసిల్ల ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ఆకట్టుకుంది. జిల్లా కేంద్రంలో టౌన్ సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా హోంగార్డు స్వరూప బైకర్స్‌కు రాఖీలు కట్టింది. ప్రాణరక్షణకు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి చలాన్లు విధించే పోలీసులు రాఖీపౌర్ణమి రోజున హెల్మెట్ లేని వాహనదారులను ఆపి రాఖీలు కట్టడం ఆకట్టుకుంది.


