● దరఖాస్తు సమయంలో ఒక ఐడీ ● మంజూరు వేళ మారిన నంబర్లు ● బీసీ విద్యార్థులకు అందని ఉపకార వేతనాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందకుండా పోయాయి. ప్రభుత్వం ఈ–పాస్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. వ్యయ ప్రయాసాలకోర్చి విద్యార్థుల తల్లిదండ్రులు చేసుకున్న దరఖాస్తులు బుట్ట దాఖలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ–పాస్, బీసీ వెల్ఫేర్ అధికారుల మధ్య సమన్వయ లోపం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. గతేడాది విద్యాసంవత్సరం బీసీ ఉపకార వేతనాలు ఇప్పటికీ అందకపోవడంతో ఈపాస్‌లో తనిఖీ చేయడంతో రెండు ఐడీల విషయం వెలుగు చూసింది.
ఒకే స్కూల్‌కు రెండేసీ ఐడీలు
జిల్లాలో వెనుకబడిన 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.4వేలు అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. దీంతో గత జూలై, ఆగస్టు మొదటి వారంలో జిల్లాలో వందలాది మంది విద్యార్థులు ఈ–పాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కులం, ఆదాయం సర్టిఫికెట్లు, స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించి, రూ.200 చెల్లించి చేసుకున్న దరఖాస్తులు ఎందుకు పనికిరాకుండా పోయాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. బీసీ శాఖ ఉపకార వేతనాలకు బడ్జెట్‌ను కేటాయించడంతో దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమవుతున్నాయి. అయితే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉపకార వేతనాల విషయంపై ఆరా తీయగా.. పాఠశాలల ఐడీలు ఆన్‌లైన్‌లో రెండు చూపడంతో ఖంగు తిన్నారు. ఉదాహరణకు జెడ్పీహెచ్‌ఎస్ నెహ్రూనగర్ పాఠశాలకు మొదట 28004490768గా చూపింది. ఇప్పుడు అదే పాఠశాలకు ఐడీ 36140600568గా చూపుతోంది. అలాగే వెంకంపేట పాఠశాల ఐడీ నంబర్ 28034490771గా చూపగా.. ఇప్పుడు 36140600571గా చూపిస్తుంది. బీసీశాఖ, ఈ–పాస్ అధికారుల సమన్వయ లోపంతోనే ఇది జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో కూడా పాఠశాలల ఐడీలు రెండు చూపాయి. దీంతో ఆ శాఖ అధికారులు ముందుగానే గుర్తించి పాత ఐడీ నంబర్లను తొలగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పాస్‌లో దరఖాస్తు చేసిన
మా కొడుకు పదో తరగతి చదువుతున్నాడు. గతేడాది బీసీ స్కాలర్‌షిప్ కోసం దరకాస్తు చేశాను. ఇప్పటికీ డబ్బులు జమకాలేదు. అనుమానం వచ్చి ఈ–పాస్‌లో చెక్ చేయగా, మా అబ్బాయి చదువుతున్న పాఠశాల పేరుతో రెండు ఐడీలు చూపింది. అధికారులకు చెబితే మాకు తెలియదంటున్నారు. మాలాగా వందలాది మంది అప్లయ్ చేసి నష్టపోయారు. ఒకే ఐడీ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
– వంగ సుదర్శన్, సిరిసిల్ల


