● ఫలించిన నాలుగేళ్ల ఎదురుచూపులు ● నేడు ఇల్లంతకుంటలో ‘డబుల్’ గృహప్రవేశాలు ● 40 కుటుంబాల్లో వెలుగులు
ఇల్లంతకుంట(మానకొండూర్): నాలుగేళ్ల ఎదురుచూపులు ఫలిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు సొంతింటి కల సాకారమవుతుందోనని ఆశగా ఉన్న నిరుపేదల జీవితాల్లో శనివారం మరిచిపోని రోజుగా మారబోతుంది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతులమీదుగా శనివారం గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. 40 కుటుంబాలు ఆత్మగౌరవంగా జీవించే అవకాశం నేటి నుంచి సాకారం కానుంది.
మౌలిక వసతులు కల్పించి
ఇల్లంతకుంట మండలం కేంద్రంలో 40 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. అయితే మౌలిక వసతులు కల్పించకుండానే లబ్ధిదారులను ఎంపిక చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీకి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలుగజేసుకొని రూ.20లక్షలతో సీసీ రోడ్డు వేయించారు. రూ.7 లక్షలతో సౌకర్యాలు కల్పించారు. అన్ని వసతులతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలోకి లబ్ధిదారులు శనివారం గృహప్రవేశాలు చేయనున్నారు.


