కొత్త విధానంలో ఇలా..
డిజిటల్ యాప్‌తో సులభంగా సర్టిఫికెట్లు బోగస్ సర్టిఫికెట్లకు బ్రేక్ మొబైల్ యాప్ ద్వారా జారీ ముందుగా ఆదాయ సర్టిఫికెట్లతో శ్రీకారం
తిప్పలు తప్పాయి
మీసేవలోనే దరఖాస్తులు
ముస్తాబాద్/వీర్నపల్లి(సిరిసిల్ల): సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాన్యువల్‌గా జరిగే విచారణతో కలిగే జాప్యాన్ని నివారిస్తూ, డిజిటల్ యాప్ ద్వారా సేవలను వేగవంతం చేస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
మారుతున్న విధానం
గతంలో కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం మీసేవలో దరఖాస్తు చేస్తే అది నేరుగా నాయబ్ తహసీల్దార్ లాగిన్‌కు వెళ్లేది. అక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి(ఆర్‌ఐ)కి, ఆపై క్షేత్రస్థాయి పరిశీలనకు పంపేవారు. కానీ కొత్త విధానంలో అభ్యర్థి మీసేవలో దరఖాస్తు చేసుకోగానే అది నేరుగా గ్రామపంచాయతీ అధికారి(జీపీవో) లాగిన్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మండల రెవెన్యూ అధికారి(ఆర్‌ఐ)కి, ఆపై నాయబ్ తహసీల్దార్‌కు డిజిటల్ రూపంలో ఫార్వర్డ్ అవుతుంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.
ముందుగా ఆదాయం సర్టిఫికెట్లతో శ్రీకారం
ధ్రువీకరణపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులకు కాలం చెల్లింది. సామాన్యులకు ఊరటనిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదాయ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. పూర్తి డిజిటల్ పద్ధతి, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఆదాయం సర్టిఫికెట్ పొందాలంటే దరఖాస్తుదారుడు తహసీల్ ఆఫీస్‌లో దరఖాస్తు నింపి, దానిపై గ్రామ పంచాయతీ అధికారి(జీపీవో), మండల రెవెన్యూ అధికారి(ఆర్‌ఐ)కి సంతకాలు తీసుకోవాల్సి వచ్చేది. అనంతరం మీసేవలో ఆన్‌లైన్ చేసి, మళ్లీ మాన్యువల్ కాపీలను సమర్పించిన తర్వాతే తహసీల్దార్ లాగిన్‌కు వెళ్లేది.
దరఖాస్తుదారుడు నేరుగా మీసేవ కేంద్రానికి వెళ్లి ఆన్‌లైన్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ చేయగానే దరఖాస్తుకు సంబంధించిన ఐడీ నంబర్ గ్రామపంచాయతీ అధికారి లాగిన్‌లో కనిపిస్తుంది. సదరు అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్‌ఐకి ఫార్వర్డ్ చేస్తారు.
ఆర్‌ఐ తన లాగిన్ ద్వారా వివరాలను తనిఖీ చేసి తహసీల్దార్‌కు పంపిస్తారు.
తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఆమోదం తెలపగానే, అభ్యర్థి మొబైల్ ఫోన్‌కు సర్టిఫికెట్ సిద్ధమైనట్లు మెసేజ్ వస్తుంది.
ఈ విధానం విజయవంతమైతే.. రానున్న రోజుల్లో కులం, నివాస ధ్రువీకరణపత్రాలను కూడా ఇదే పద్ధతిలో అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
ఒకప్పుడు ఆదాయం సర్టిఫికెట్ కావాలంటే అధికారుల సంతకాల కోసం రోజుల తరబడి ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేస్తే అధికారులే పరిశీలించి డిజిటల్ సంతకంతో పంపిస్తున్నారు. ఇది చాలా సులభంగా ఉంది. మీసేవ కేంద్రానికి వెళ్లే పని లేకుండా, ఇంట్లోనే కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. – పిట్ల ఖాజీబాబు, వీర్నపల్లి
గతంలో ఆదాయ ధ్రువీకరణపత్రాలకు జీపీవోల వద్దకు దరఖాస్తుదారులు వెళ్లేవారు. మీసేవకు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేక యాప్ ద్వారా జీపీవో లాగిన్‌లోకి వస్తుంది. ఆయన విచారణ చేసి వాటిని ఆర్‌ఐకి పంపిస్తారు. ఆర్‌ఐ పరిశీలన తర్వాత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్ వస్తుంది.
– బి.రామ్‌చందర్, తహసీల్దార్, ముస్తాబాద్


