● సెస్ కార్మికులు, ఉద్యోగులు ● మూడో రోజు మిన్నంటిన నిరసన
సిరిసిల్లటౌన్: దశాబ్దాలుగా సెస్ సంస్థకు సేవలు అందిస్తున్నామని తమ కుటుంబాలను రోడ్డున పడేయొద్దని విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 72 గంటల నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సెస్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా టీజీయూఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్‌రావు మాట్లాడుతూ దశాబ్దాలుగా సంస్థలో పనిచేస్తూ కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా అసిస్టెంట్ హెల్పర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్రావుపల్లికి చెందిన శ్రీకాంత్, వెంకటేశ్వర ఐ హాస్పిటల్ భానుచందర్ పులిహార, మజ్జిక ప్యాకెట్లు అందించారు. ముస్తాబాద్ మండలం చీకోడ్ సర్పంచ్ అంజయ్య, చిప్పలపల్లి సర్పంచ్ లక్ష్మణ్, సెస్ సిరిసిల్ల పట్టణ ప్రతినిధి సుదర్శన్ వెంకటేశ్, ఐద్వా రాష్ట్ర నాయకురాలు మల్లు లక్ష్మి, జిల్లా నాయకురాలు జువ్వాజి విమల, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి రాజశేఖర్, మూశం రమేశ్, గ్రామపంచాయతీ కార్మికులు బూర శ్రీనివాస్, మల్యాల నర్సయ్య సంఘీభావం తెలిపారు. టీజీయూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి నర్ర శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


