● వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మొద్దు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడొద్దని, వదంతులు నమ్మొద్దన్నారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
బ్లాక్ దందా చేయొద్దు : ఎస్పీ
గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించొద్దని, బ్లాక్ దందా చేయొద్దని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా పౌ ర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీవో సీ.హెచ్.వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్‌రెడ్డి, అఫ్జల్‌బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు.
పిల్లలపై శ్రద్ధ పెట్టాలి
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.


