నేటి నుంచి పదోతరగతి పరీక్షలు 34 పరీక్ష కేంద్రాలు.. 7,317 విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో పదోతరగతి పరీక్షలను ప్రశాంతంగా రాయాలని, పరీక్ష కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్న సందర్భంగా జిల్లాలో పరీక్షలకు చేసిన ఏర్పాట్లను శుక్రవారం వివరించారు. జిల్లాలో 34 కేంద్రాలు ఏర్పాటు చేశారని, నిర్ణీత పరీక్ష సమయం తరువాత ఐదు నిమిషాలు వరకు కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు.
7,317 మంది విద్యార్థులు
జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 7,317 మంది విద్యార్థులు హాజరుకానుండగా, బాలురు 3,511, బాలికలు 3,806 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో డెస్క్‌లు, తాగునీరు, టాయిలెట్స్, ట్యూబ్‌లైట్స్ సౌకర్యాలు కల్పించారు.
144 సెక్షన్ అమలు
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు.
పర్యవేక్షణకు బృందాలు
పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు 34, డిపార్ట్‌మెంటల్ అధికారులు 34, సిట్టింగ్ స్క్వాడ్ 34, ఫ్లయింగ్ స్క్వాడ్ రెండు టీంలు, అడిషనల్ డిపార్టుమెంటు ఆఫీసర్స్, స్టేట్ లెవెల్ అబ్జ ర్వర్స్, కస్టోడియన్ అధికారులను నియమించారు.


