రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి
సిరిసిల్ల: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయింది.. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఏం అభివృద్ధి పనులు చేసిందో చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం మంచి పనులు చేయకుండానే ఓట్లు అడిగే నైతిక హక్కుల ఆ పార్టీ అభ్యర్థులకు లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మొన్నటి గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ మరోసారి అదే రుజువైందన్నారు. అయినా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మూడు రోజులు ఇక్కడే ఉండి, వార్డుల్లో ప్రచారం చేస్తూ.. బీఆర్‌ఎస్ గెలిస్తే అభివృద్ధి సాధ్యమంటున్నారని, నిజానికి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్‌ఎస్‌తో అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మున్సిపాలిటీలకు 14,15వ ఆర్థికం సంఘం ద్వారా నిధులు ఇస్తున్నారని, ఉచితంగా సన్న బియ్యం పంపుతున్నారని, అమృత్ పథకంతో తాగునీటి పథకాలకు నిధులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను బీజేపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఇచ్చిన భరోసాతో ఓటర్లు కమలం గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. నాయకులు తిరుపతిరెడ్డి, నటరాజ్‌గౌడ్, సంజీవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


