స్వామి.. ఓ సంచలనమే | - | Sakshi
Sakshi News home page

స్వామి.. ఓ సంచలనమే

Feb 8 2026 4:24 AM | Updated on Feb 8 2026 4:24 AM

స్వామ

స్వామి.. ఓ సంచలనమే

సిరిసిల్ల: మావోయిస్టు చందర్‌ అలియాస్‌ పడ్కల్‌ స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ హయాంలో సిరిసిల్ల ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నడిచింది. పీపుల్స్‌వార్‌(ప్రస్తుత మావోయిస్టు) పార్టీ పశ్చిమ డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడి రెండేళ్లపాటు పనిచేశారు. తన కాలంలో భారీగా రిక్రూట్‌మెంట్స్‌తో ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ప్రస్తుతం సీపీఐ(ఎంఎల్‌) మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర వెస్ట్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేటి చందర్‌రావు(57) గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో స్వామితోపాటు ఏడుగురు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీస్‌ కమాండో కానిస్టేబుల్‌ దీపక్‌ చిన్నమదవి మంద్రా(38) ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడికి చెందిన చందర్‌ రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు.

కోనరావుపేట ఎస్సైపై కాల్పులు

1998లో కోనరావుపేట ఎస్సైగా ఉన్న ముసిపట్ల శ్రీనివాస్‌గౌడ్‌ పోలీసు బలగాలతో శివారు అడవుల్లోకి కూంబింగ్‌కు వెళ్లారు. ఎగ్లాస్‌పూర్‌కు చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిమ్మపల్లి వైపు వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న మావోయిస్టు స్వామి దళం పోలీసులపై మెరుపుదాడి చేసి కాల్పులు జరిపారు. కూంబింగ్‌లో ముందు వరుసలో వస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ అక్కడికక్కడే మరణించారు. మరికొందరు పోలీసులు గాయాలతో బయటపడ్డారు.

● అదే ఏడాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు కెనాల్‌ పక్కన హోంగార్డు శ్రీనివాసరాజు కోవర్టుకు పాల్పడుతున్నాడని కాల్చి చంపారు.

● కోనరావుపేట మండలం వట్టిమల్లలో 1997, జూలై 28న మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను సాయుధ నక్సలైట్లతో నిర్వహించారు. వట్టిమల్ల వేదికగా జనాన్ని సమీకరించి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించారు. వట్టిమల్లకు వచ్చే నాలుగు దారుల్లోనూ సాయుధ నక్సలైట్లతో మందుపాతరలు అమర్చి మూడు గంటలపాటు పొద్దంతా సమావేశాన్ని నిర్వహించడం అప్పట్లో ఓ సంచలనం.

● వీర్నపల్లి మండలం గర్జనపల్లి, కోనరావుపేట మండలం మరిమడ్లలో అటవీశాఖ కాంట్రాక్టర్ల ద్వారా తునికాకు సేకరణ చేసింది. కూలీలకు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించి సేకరించిన తునికాకును నిల్వ చేశారు. రూ.కోటి విలువైన తునికాకును లారీల్లో మధ్యప్రదేశ్‌కు అమ్మేసి ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని గ్రామాభివృద్ధికి, కొంత ఉద్యమ అవసరాలకు వినియోగించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

● 1999లో కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో ప్రజాకోర్టును నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి మీడియాను తెప్పించి ప్రజాకోర్టును ఏర్పాటు చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి పార్టీ సానుభూతిపరుడు భానును, కోనరావుపేట మండలం మరిమడ్లకు చెందిన నాగరాజు గర్జనపల్లి అడవుల్లో పట్టుకుని కాల్చి చంపారు. అప్పట్లో పీపుల్స్‌వార్‌కు, జనశక్తి పార్టీలకు మధ్య వైరుధ్యాలు ఉండేవి. ఆధిపత్య పోరులో భాగంగా జనశక్తికి చెందిన ఇద్దరిని కాల్చిచంపారు. ఇంకా అనేక హింసాత్మక ఘటనలకు, భౌతికదాడులకు, సంచలన ఘటనలకు పడ్కల్‌ స్వామి కేంద్రబిందువుగా నిలిచారు.

పడ్కల్‌ స్వామిగా గుర్తింపు

1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న స్వామి ఏనాడు ఇంటి ముఖం చూడలేదు. 1993లో నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడ్కల్‌లో సిర్నాపల్లి దళం సేదతీరుతుండగా పోలీసులు దాడి చేశారు. ఆ సంఘటనలో డిప్యూటీ దళకమాండర్‌ సంజీవ్‌, గోపి, క్రాంతి మరణించారు. పడ్కల్‌లో పోలీసులతో రెండు రోజులపాటు ఒక్కడే పోరాడి ఒక్క కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. అప్పటి డీజీపీ పడ్కల్‌కు రావడం విశేషం. స్వామి ఉన్న ఇంటికి నిప్పు పెట్టగా ఏకే 47తో కాల్పులు జరిపి పోలీసులు వెనక్కి తగ్గగానే తప్పించుకున్నారు. అప్పట్లో ఇదో సంచనం. అప్పటి నుంచి పడ్కల్‌ స్వామిగా లోకేటి చందర్‌రావుకు గుర్తింపు. ఆయన భార్య సులోచన అలియాస్‌ నవనీత పార్టీలో పనిచేస్తూనే 2016లో అనారోగ్యంతో మరణించారు. ఆయన కొడుకు రమేశ్‌ ఇటీవల పోలీసులకు లొంగిపోయారు. రమేశ్‌ భార్య బుజ్జి అలియాస్‌ కమలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్వామి ఎన్‌కౌంటర్‌ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాబల్య గ్రామాల్లో శనివారం చర్చనీయాంశమైంది.

తెలంగాణ ఆవశ్యకతపై ప్రసంగం

సిరిసిల్లలో చర్చనీయ ఘటనలు

గొడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మృతి

జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్న మాజీలు, సానుభూతిపరులు

స్వామి.. ఓ సంచలనమే1
1/1

స్వామి.. ఓ సంచలనమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement