గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వేములవాడరూరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఎస్సై చల్లా వెంక్రట్రాజం తెలిపారు. మృతునికి 50 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మెడలో రుద్రాక్ష, ఇతర మాలలు ధరించి ఉన్నాడు. మతిస్థిమితం సరిగ్గా లేక.. కాగితాలు ఏరుకునేవాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే 87126 56417లో సంప్రదించాలని కోరారు.
● పత్తిపాకలో దొంగతనం
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలోని మెన్నెని వెంకటనర్సింగరావు ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. వెంకటనర్సింగరావు తన ఇంటికి తాళాలు వేసి పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. శనివారం ఉదయం వచ్చిచూడగా తాళం పగులకొట్టి కనిపించింది. లోనికి వెళ్లిచూడగా.. బీరువా ధ్వంసమై ఉంది. అందులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుడికి సంబంధించిన 19 గ్రాముల బంగారు ఆభరణాలు, 510 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌టీం పోలీసులు వేలిముద్రలు సేకరించారు.
25ఏళ్లుగా స్వామివారి కానుకలు ఇక్కడే..
పత్తిపాకలో 2000–2001 సంవత్సరంలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటినుంచి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమకూరే కట్నకానుకలను మాజీ సర్పంచ్ వెంకటనర్సింగరావు ఇంట్లోనే భద్రపర్చుతున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చిన కట్నకానుకలనూ ఆయన ఇంట్లో ఉంచేందుకు భక్తులు రాగా.. తాను స్థానికంగా ఉండడం లేదు, వేరేవారి ఇంట్లో భద్రపర్చాలని చెప్పారు. అయినా, గ్రామస్తులు ఒప్పుకోలేదు. ఆయన ఇంట్లోనే ఆభరణాలు భద్రతపరిచారు. దొంగలు ఈ ఆభరణాలతోపాటు వాటి తాలూకు జాబితా కూడా ఎత్తుకెళ్లారు. దీంతో బంగారం, వెండి ఎంతుందనే సమాచారం తెలియడం లేదు. దీనిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ స్పష్టత ఇవ్వలేదు.
సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లో శనివారం రెండు వేర్వేరు సంఘటనల్లో రూ.4లక్షలు సీజ్ చేశారు. జగిత్యాలకు చెందిన శ్రీనాథ్ తన కారులో వస్తుండగా పోలీసుల తనిఖీల్లో రూ.2లక్షలు నగదు పట్టుబడిందని సిరిసిల్లటౌన్ సీఐ కృష్ణ తెలిపారు. వేములవాడ మండలం ఎదురుగట్ల నుంచి చిగురు వినోద్ సిరిసిల్ల వస్తుండగా స్థానిక చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.2లక్షలు నగదు తరలిస్తున్నట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


