అనుమానం పెనుభూతమై..
● గొడ్డలితో నరికి.. కత్తితో గొంతుకోసి
● భార్యను దారుణంగా చంపిన భర్త
● నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
జగిత్యాలక్రైం: మూడుముళ్లు వేసి.. ఏడడుగులు వేసి.. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను అనుమానిస్తూ.. ఆమైపె కక్ష పెంచుకుని నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి.. కత్తితో గొంతు కోసి దారుణహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో శనివారం వేకువజామున వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపూర్‌కు చెందిన అదరవేని మల్లయ్యతో 30 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణ శివారు ఉప్పరిపేటకు చెందిన సత్తవ్వతో వివాహమైంది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా మల్లయ్య భార్యను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిస అయిన మల్లయ్య సత్తవ్వను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు పంచాయితీలు జరిగాయి. వేధింపులు భరించలేని సత్తవ్వ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అయినా వేధించడంతో తల్లిగారింటికి వెళ్లి కొన్నేళ్లు అక్కడే ఉంది. మూడేళ్ల క్రితం పెద్దలు పంచాయితీ చేసి ఇద్దరిని కలిపారు. అప్పటినుంచి సత్తవ్వ పిల్లలను చూసుకుంటూ.. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. కుమారుడు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న కూతురు నాలుగురోజుల క్రితం తన ఫ్రెండ్స్‌తో కలిసి హైదరాబాద్ వెళ్లింది. దీనిని అదునుగా చేసుకున్న మల్లయ్య.. శనివారం వేకువజామున రెండు గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సత్తవ్వను గొడ్డలితో నరికాడు. సత్తవ్వ సృహ కోల్పోవడంతో కూరగాయల కత్తితో గొంతు కోశాడు. విచక్షణరహితంగా శరీరంపై పొడిచాడు. ఆమె మృతిచెందిందని నిర్ధారించుకుని అక్కడినుంచి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి సోదరుడు గడ్డం చిన్నమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ తెలిపారు.
లక్ష్మీపూర్‌లో విషాదం
ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడు, కూతురును ఉన్నత చదువులు చదివిస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయంత్రం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడు మల్లయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు.
అనుమానం పెనుభూతమై..


