వెబ్ కాస్టింగ్
పోలింగ్ శాతం పెంచేందుకు..
పోలింగ్ కేంద్రాల్లో
● 175 పోలింగ్ కేంద్రాలు.. 1,212 మంది సిబ్బంది
● 48 సెన్సిటివ్, 17 క్రిటికల్ సెంటర్స్
● ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం
● ‘సాక్షి’తో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
ఎన్నికల నిర్వహణ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసారి క్యూఆర్ కోడ్ ద్వారా ప్రశ్నావళిని ఇచ్చాం. ఆ ప్రశ్నావళిలో ఎన్నికల సిబ్బంది సమర్థత వెలుగు చూస్తుంది. ఎన్నికల నిర్వహణపై అవగాహన లోపం ఉన్న వారికి మళ్లీ శిక్షణ ఇచ్చాం. ఇలా పూర్తి అవగాహనతో సిబ్బంది ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ర్యాండమైజేషన్ పూర్తయింది. మూడోసారి ర్యాండమైజేషన్ చేసిన తర్వాతే సిబ్బందికి పోలింగ్ కేంద్రాల కేటాయింపులు ఉంటాయి. ఓట్లలెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తాం. మాక్ కౌంటింగ్‌ను నిర్వహిస్తాం. సిరిసిల్లలో ఓట్ల లెక్కింపు కొత్తబస్టాండులోని సినారె కళామందిరంలో, వేములవాడలోనూ సినారె కళామందిరంలో జరుగుతుంది.
సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ తెలిపారు. ప్రతీ ఒక్క ఓటరు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటుహక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు చేశామని, ఫామ్–12 ద్వారా దరఖాస్తును సమర్పించి ఓటుహక్కు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ‘సాక్షి’తో శుక్రవారం మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
48 సెన్సిటివ్, 17 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు
రెండు మున్సిపాలిటీల్లో 48 సెన్సిటివ్, 17 క్రిటికల్ పోలింగ్‌స్టేషన్లు ఉన్నట్లు పోలీస్‌శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జిల్లా పోలీసులు చేస్తారు. 175 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఉంటుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తారు.
1,212 మంది సిబ్బంది
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్ని కల నిర్వహణకు 1,212 మందిని నియమించాం. నామినేషన్ల కోసం మూడు వార్డులకు ఒక్కో ఆర్వోను నియమించాం. సిరిసిల్లలో 13, వేములవాడలో 10 మందిని నియమించాం. ఎన్నికల నిర్వహణకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవోలతోపాటు ముగ్గురు ఓపీవోలు ఉంటారు. 20 శాతం అదనపు సిబ్బందిని రిజ ర్వులో ఉంచాం. ఓట్ల లెక్కింపునకు 243 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల విధులకు నియమించబడిన సిబ్బంది అందరూ శిక్షణకు హాజరయ్యారు. సిరిసిల్లలో 8, వేములవాడ 6 జోన్లుగా విభజించి ఎన్నికలను నిర్వహిస్తున్నాం. 23 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించాం.
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అందించాం. శని, ఆదివా రాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ముందుగా ఫామ్–12 సమర్పించిన సిబ్బందికే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది.
జిల్లాలో రూ.26.70 లక్షలు సీజ్ చేశాం
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల శివారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. లెక్కలు చూపకుండా తరలిస్తున్న రూ.26.70లక్షల మేరకు సీజ్ చేశాం. క్షేత్రస్థాయిలో సిరిసిల్లలో మూడు, వేములవాడలో మూడు తనిఖీ బృందాలతో నిఘా ఉంచాం. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధల మేరకు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి స్వేచ్ఛగా, నిజాయితీగా ఓటుహక్కును వినియోగించుకోవాలి.
సిరిసిల్లలో 39 వార్డులు 117 పోలింగ్ స్టేషన్లు, వేములవాడలో 28 వార్డులు, 58 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సిరిసిల్లలో 81,959 మంది, వేములవాడలో 40,877 మంది ఓటర్లు ఉన్నారు. దివ్యాంగులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేలా ర్యాంపులు ఏర్పాటు చేశాం. బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటర్లకు స్లిప్స్ పంపిణీ చేయడం ద్వారా ఓటు వేయాలనే ఆలోచన వస్తుంది. ఇప్పటికే అన్ని పొలిటికల్ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలని సూచించాం. డిగ్రీ కాలేజీల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం.
వెబ్ కాస్టింగ్


