కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లా పోతది
● సిరిసిల్లకు కేసీఆర్ సముద్రాన్ని తెచ్చాడు ● నేతన్నలను కడుపులో పెట్టుకున్నాడు ● బీడీ కార్మికులకు ఆసరా అయ్యాడు ● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల/వేములవాడ/సిరిసిల్లఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జిల్లా పోతదని, నా మీద కోపంతో జిల్లాను రద్దు చేయాలనే ఆలోచన చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని పెద్దూరు బాబాజీకాలనీ, పెద్దూరు చౌరస్తా, తారకరామానగర్, విద్యానగర్, సుభాష్‌నగర్, నేతన్నచౌక్, పద్మనగర్, చంద్రంపేటతోపాటు వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ బస్టాండు, అమరవీరుల స్తూపం, తెలంగాణచౌక్‌లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పెన్షన్లను పెంచలేదు, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు, బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, రైతుబంధు ఇవ్వలేదు, కల్యాణలక్ష్మీలో తులం బంగారం ఇవ్వలేదు, కేసీఆర్ కిట్టు లేదన్నారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో మీ కళ్ల ముందే ఉందన్నారు. మానేరు వాగులోకి సముద్రాన్ని తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. మెడికల్ కాలేజీ, జేఎన్‌టీయూ, వ్యవసాయ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, అపెరల్ పార్క్.. కేసీఆర్ నిధులిస్తే.. నేను మంత్రిగా చేశానని గుర్తు చేశారు.
నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీరలు
నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలు తగ్గించాలనే లక్ష్యంతో రూ.3,400కోట్లతో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే.. కాంగ్రెస్ ఆ పథకాన్ని రద్దు చేసిందన్నారు. చెయ్యి గుర్తును గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు వస్త్రోత్పత్తిదారులను బెదిరిస్తున్నారన్నారు. బిడ్డా.. ఇది కేటీఆర్ అడ్డా.. బిల్లులు ఇవ్వము.. ఆర్డర్లు ఇవ్వమంటే గల్లా పట్టి నిలదీస్తామన్నారు. సిరిసిల్ల గులాబీ కంచుకోట అని మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు వేసి మరోసారి నిరూపించాలని కోరారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉండి బండి సంజయ్ సిరిసిల్లకు, రాజన్నకు ఒక్కపైసానైనా తెచ్చాడా అని కేటీఆర్ నిలదీశారు. గుడి ముందు బిచ్చగాళ్లలాగా దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. మీ దయతోనే మంత్రిని అయిన.. సీఎం కేసీఆర్ చొరవతో జిల్లాను సాధించుకున్నామని.. ఇప్పటికే చాలా పనులు చేసుకున్నాం.. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి.. అవి చేయించే బాధ్యత తనదేనన్నారు. దండం పెట్టి చెబుతున్నా.. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కొండూరి రవీందర్‌రావు, తోట ఆగయ్య, తుల ఉమా, చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే..మోసానికి వేసినట్లే
కాంగ్రెస్‌కు ఓటువేస్తే మోసానికి వేసినట్లేనని ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. విలీన గ్రామాలను పట్టణంలో కలిపితే అభివృద్ధి చెందుతాయనుకున్నామే తప్ప మరే ఉద్దేశం లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలీన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్చుకుందామన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఓటు ద్వారా కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.


