పంచిన మద్యం సీసాలు వైన్స్‌షాపుల్లోకి..
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఓ వార్డులో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ప్రతిరోజూ సాయంత్రం ముగ్గురు అభ్యర్థులు అడిగినవారికి లేదనకుండా మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ముగ్గురు ఇచ్చిన మందును ఒకేరోజూ తాగలేకపోతున్నారు. దీంతో వారు కొత్త ఐడియాకు తెరతీశారు. ఒక అభ్యర్థి ఇచ్చిన మందును ఆ రోజు తాగి.. మిగిలిన అభ్యర్థులు ఇచ్చిన మందు బాటిళ్లను వైన్స్‌షాపులకు తీసుకెళ్లి ఇచ్చి నగదు తీసుకుంటున్నారు. ఇలా సమకూరిన డబ్బులను తలాకొంత పంచుకుంటుండడం విశేషం. ప్రచారంలో భాగంగా వచ్చిన మద్యం బాటిళ్లను ఇచ్చి డబ్బులు తీసుకెళ్లడంతో వైన్స్‌షాపు నిర్వాహకులు నివ్వెరపోతున్నారు.
కండువాలు మారుతున్నాయ్..
కొందరు కార్యకర్తలు ఉదయం ఒకపార్టీకి.. మధ్యాహ్నం మరోపార్టీకి.. సాయంత్రం ఇంకో పార్టీకి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎప్పడికప్పుడు కండువాలు మారుస్తూ.. పోటీలో ఉన్న అభ్యర్థులను కంగారుపెడుతున్నారు. మహిళాసంఘాల సభ్యులైతే ఎవరు ప్రచారానికి రమ్మంటే వారివెంట వెళ్తున్నారు. అభ్యర్థులు కూడా కార్నర్ మీటింగ్‌లకు మహిళాసంఘాల సభ్యులను తరలిస్తున్నారు. వీరికి ఆయా పార్టీల వారు రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తున్నట్లు సమాచారం. పొద్దంతా మూడు పూటల మూడు పార్టీల ప్రచారంలో పాల్గొంటే ఎంత తక్కువనుకున్నా రూ.వెయ్యి వరకు గిట్టుబాటు అవుతోంది. కొంతమంది మహిళా సంఘాల ప్రతినిధులు బరిలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేసి ‘మీరేమీ అనుకోవద్దు.. మేం మీకే ఓటు వేయిస్తాం..’ కేవలం డబ్బుల కోసం ఓ పూట ప్రచారానికి వెళుతున్నామని చెబుతుండడం గమనార్హం.
బాటిళ్లు ఇచ్చి నగదు తీసుకుంటున్న వైనం
ఒక్కోరోజు ఒక్కో అభ్యర్థి
పంచిన మద్యం సేవనం
మిగిలిన వారు ఇచ్చిన బాటిళ్లకు
వచ్చిన డబ్బులు తలాకొంత


