ఇంటికొస్తున్నామని.. అంతలోనే దూరమై
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
● ఎదురెదురుగా వాహనాలు ఢీకొని దుర్మరణం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరామని ఫోన్‌లో చెప్పిన ఇద్దరు యువకులు.. అంతలోనే ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి– తారుపల్లి గ్రామాల మధ్యలో క్రాస్ రోడ్డు వద్ద గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓదెల మండల పొత్కపల్లికి చెందిన పచ్చిక నాగఫణీందర్‌రెడ్డి(28) పెద్దరాతుపల్లిలో సోలార్ ప్లాంట్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తుండగా, పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన బొజ్జం సురేశ్(27)వ్యవసాయం చేస్తాడు. ఫణీందర్‌రెడ్డి విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, సురేశ్ కాల్వశ్రీరాంపూర్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తూ ఇద్దరూ ఎదురెదురుగా ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. కాగా సురేశ్‌కు వివాహం జరిగి ఏడాది కూడా దాటలేదు. ఫణీందర్‌రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహం అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇద్దరు యువకుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంటికొస్తున్నామని.. అంతలోనే దూరమై


