కోతుల పంచాయితీ
ఊళ్లలో కిష్కిందకాండ ఇళ్లు గుల్ల చేస్తున్న కోతులు కొత్త పాలకవర్గాలకు తలనొప్పిగా మారిన సమస్య పలు గ్రామాల్లో పట్టించేందుకు తీర్మానం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇళ్ల పెంకులు.. పండ్ల చెట్లు.. ధాన్యం కుప్పలు కనిపిస్తే చాలు కోతుల మంద వచ్చి చేరుతున్నాయి. క్షణాల్లో గుల్ల చేసి వెళ్లిపోతున్నాయి. వందలాది కోతుల వస్తుండడంతో ప్రజలు సైతం భయాందోళన చెందుతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇటీవల జిల్లాలో కోతుల దాడిలో గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈక్రమంలోనే కొత్తగా కొలువుదీరిన పాలకవర్గాలకు కోతుల నివారణ సవాల్‌గా మారింది. అత్యధిక గ్రామాల్లో ఎన్నికల మేనిఫెస్టోగా కోతులను తరిమికొడతామని ప్రచారం చేసి విజయం సాధించారు. ఈక్రమంలోనే ఇటీవల చాలా గ్రామాల్లో కోతులను పట్టిస్తున్నారు. గ్రామస్తులు, పాలకవర్గాలు సంయుక్తంగా కోతులను ఊరి నుంచి తరిమికొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
కమిటీలతో ముందుకు..
గ్రామాల్లో కోతుల నివారణ సవాల్‌గా మారడంతో నూతన పాలకవర్గాలు మొదటి తీర్మానంగా దీన్ని ఎంచుకుంటున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉండగా అన్ని జీపీల్లో కోతులతో కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికల ప్రధాన హామీ అయిన కోతుల నివారణకు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో పాలకవర్గం, గ్రామస్తులు సంయుక్తంగా ముందుకొచ్చారు. ఇంటికి రూ.300 చొప్పున జమచేయాలని నిర్ణయించారు. నిధుల సేకరణ, కోతుల తరలింపు బాధ్యతలు చూసుకునేందుకు గురువారం సమావేౖశమైన గ్రామస్తులు 10 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఇల్లంతకుంట, బోయినపల్లి, వేములవాడ మండలాల్లో కోతులు పట్టే వారిని తెప్పించారు.
దాడులు.. భయాందోళన
పల్లె ప్రజలపై కోతుల దాడులు ఇటీవల పెరిగిపోయాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో కోతులు తర మడంతో భయాందోళనతో ఓ వృద్ధురాలు పరుగులు తీసి చేదబావిలో పడిపోయింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు తాడుతో పైకి లాగారు. సింగారంలో లక్ష్మి అనే మహిళపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. సొంత డబ్బులతో ఇంజక్షన్లు వేయించుకుంది. ముస్తాబాద్ మండలంలో ఓ మహిళ గాయపడింది. కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్‌పూర్‌లో స్కూ ల్ పిల్లలు కోతుల భయంతో చేతుల్లో కట్టెలతో పాఠశాలకు వెళ్తున్నారు. ఇలాంటి దృశ్యాలు రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏ పల్లెకు వెళ్లిన కనిపిస్తున్నాయి.
ఈ ఫొటో ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం సమావేశం. గ్రామంలోని కోతుల సమస్య తీవ్రం కావడంతో ఎలా పరిష్కరిద్దామని చర్చించారు. కోతుల నివారణకు పది మందితో కమిటీ వేశారు. పాలకవర్గం సభ్యులు స్వచ్ఛందంగా కొంత మొత్తం నగదును జమచేయడంతోపాటు గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి నగదు జమ చేయాలని తీర్మానించారు. ఈ డబ్బులతో కోతులు పట్టేవారిని తెప్పించాలని నిర్ణయించారు.
కోతుల పంచాయితీ


