సెస్‌లో ఏం జరుగుతోంది !
‘సెస్’ సమగ్ర స్వరూపం
ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు
● అవినీతి ఆరోపణలు ● పాలకవర్గంలో విభేదాలు ● విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు ● వెలుగుల సంస్థను ముసిరిన చీకట్లు
సిరిసిల్ల: రాష్ట్రంలోనే ఏకై క సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తని ఖీలు.. పాలకవర్గంలో విభేదాలు.. మెటీరియల్ కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలతో వెలుగుల సంస్థను చీకట్లు ముసురుకున్నాయి. తాజా పరిణా మాల నేపథ్యంలో సామాన్యులకు ‘సెస్’లో ఏం జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి.
మూడేళ్ల రికార్డులపై విచారణ
‘సెస్’ పాలకవర్గానికి 2022 డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. 2022–2023, 2023– 2024, 2023–2025 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సంస్థ కొనుగోలు చేసిన మెటీరియల్, విక్రయించిన స్క్రాప్, పరిశ్రమలకు అందించిన విద్యుత్ సర్వీసులు, విద్యుత్‌లైన్లు, కొనుగోలు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు వంటి వాటి రికార్డులను విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు. ‘సెస్’ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమైన తీర్మానాలకు సభ్యుల ఆమోదం లభించిందా? ఏమైనా తీర్మానాలను పాలకవర్గం తమకు అనుకూలంగా చేసుకుందా? కొత్తగా ఆర్‌సీఎస్ అనుమతి లేకుండా ఉద్యోగులను నియమించారా? అనే కోణంలో విచారణ సాగుతోంది.
విజిలెన్స్‌కు అందిన ఫిర్యాదులివీ..
● ‘సెస్’ కోసం ఆరు నెలల కిందట రూ.50లక్షలతో మెటీరియల్ కొనుగోలుకు టెండర్లు పిలిచారు. రూ.32లక్షల మెటీరియల్ కొనుగోలు చేసి మధ్యలో నిలిపివేశారు. ఈ కొనుగోళ్లపై ఫిర్యాదులు ఉన్నాయి.
● జిల్లాలో 2,500 ఎర్త్ పైపులను ఎన్పీడీసీఎల్ పర్చేజ్ ఆర్డర్ ప్రకారం అదే కాంట్రాక్టర్ ద్వారా పాలకవర్గం తీర్మానం మేరకు ఆర్డర్లు ఇచ్చారు. కానీ 1,258 ఎర్త్ పైపుల సరఫరా జరిగిన తరువాత ఆర్డర్‌ను నిలిపివేశారు. ఒక్కో ఎర్త్ పైపు ధర రూ.1,600 ఉండగా.. రూ.2,350 కోట్ చేసి ఒక్కో దానిపై రూ.750 చొప్పున నొక్కేసినట్లు తేలింది. వీటి అవసరం లేకున్నప్పటికీ పర్సెంటేజీల కోసమే కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి.
● ‘సెస్’ సంస్థ స్టోర్స్‌లోని మెటీరియల్ రికార్డులకు, నిల్వకు తేడాలు ఉన్నాయి. ‘సెస్’ సిబ్బందే మెటీరియల్‌ను మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకా అనేక అంశాలపై జిల్లాలోని ‘సెస్’ వినియోగదారులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
పాలకవర్గంలో చీలిక
‘సెస్’ పాలకవర్గంలో చీలిక వచ్చి చైర్మన్ చిక్కాల రామారావుపై అవిశ్వాసం పెట్టాలని కొందరు భావిస్తున్నారు. మెజార్టీ డైరెక్టర్లు చైర్మన్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. పలువురు ఉద్యోగులు సైతం పాలకవర్గం తీరుపై అసహనంతో ఉన్నారు. పాలకవర్గం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వెంటనే ఎత్తిచూపేందుకు వీలుగా ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సంస్థలో జరుగుతున్న పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
స్థాపితం: 1970 నవంబరు 1
విద్యుత్ కనెక్షన్లు: 2,80,106
ఉద్యోగులు : 418
రెగ్యులర్ ఉద్యోగులు : 358
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది : 60
ప్రతీ నెల విద్యుత్ వినియోగం విలువ: రూ.21.30 కోట్లు
ఆదాయం: రూ.13.25 కోట్లు
ఉద్యోగుల జీతాలు : రూ.2.60 కోట్లు
సంస్థ నిర్వహణ ఖర్చు: రూ.50 లక్షలు
ఎన్‌పీడీసీఎల్‌కు చెల్లించాల్సిన మొత్తం : రూ.10.50 కోట్లు
‘సెస్’ ఉద్యోగుల హాజరు జీపీఎస్ విధానంలో ఉండాలని, విధులు నిర్వహించే ప్రదేశం నుంచి ఫేస్(ముఖచిత్ర) నమోదు చేయాలని ఆదేశించారు. హాజరు అలా నమోదు చేయకుంటే జీతాల్లో కోతలు తప్పవని హెచ్చరించారు. అక్టోబరు నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు.
ఉద్యోగులు ఎక్కడికి వెళ్తున్నారు.. ఏం పనిపై వెళ్తున్నారో ముందస్తుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాల్లో ఉద్యోగుల పని తీరును చూసేలా కొత్త సాప్ట్‌వేర్‌ను రూపొందించారు.
విద్యుత్ బిల్లింగ్ రీడింగ్‌కు మొబైల్ స్కానింగ్‌ను అమలు చేస్తున్నారు. మెటీరియల్ కొనుగోలుకు ఈ–టెండర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
విద్యుత్ బిల్లుల చెల్లింపులకు యూపీఐ అవకాశం కల్పించారు. దీంతో నేరుగా సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి బిల్లులు జమవుతున్నాయి.
సెస్‌లో ఏం జరుగుతోంది !


