రీజినల్ కోఆపరేటివ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు
సిరిసిల్లటౌన్: పోటీతత్వాన్ని తట్టుకునేలా సహకార రంగం నూతన ఒరవడితో ముందుకెళ్తోందని వరంగల్ కోఆపరేటీవ్ ట్రెయినింగ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సిరిసిల్లలోని ది సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా సహకార అధికారి రామకృష్ణ మాట్లాడుతూ సహకార సంస్థలు డిజిటలైజేషన్, ఈ–కామర్స్‌లలోని ఆవిష్కరణలను అన్వయించుకుని అభివృద్ధి సాధించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలకు ఆర్‌ఆర్ వాటర్‌ప్లాంటు మిషనరీ, టీవీలు అందజేశారు. బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, సూపరింటెండెంట్ రమాదేవి, డైరెక్టర్లు అడ్డగట్ల మురళి, గుడ్ల సత్యానందం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్‌రాజు, బుర్ర రాజు, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాసు, ఎనగందుల శంకర్, వలస హరిణి, పత్తిపాక సురేష్, కోడం సంజీవ్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహకాధికారి పత్తిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి సహకరించండి
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని పురాతన శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు విన్నవించినట్లు మాజీ ఎంపీటీసీలు గుండెల్లి శ్రీనివాస్, గజ్జెల రాజు తెలిపారు. ఈమేరకు హైదరాబాద్‌లో సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితోపాటు కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. బద్దిపడిగే అనిల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
చీరల ఆర్డర్లు ఇవ్వాలి
సిరిసిల్లఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం చీరల ఆర్డర్లు 64 లక్షలే ఇచ్చిందని, మిగతా ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని చేనేత పవర్‌లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంతం రవి కోరారు. సుభాష్‌నగర్ కార్మిక భవనంలో గురువారం మాట్లాడారు. కోటి చీరల ఉత్పత్తికి ఆర్డర్ ఇస్తామని.. టెస్కో ద్వారా 64 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. మిగతా 36 లక్షల చీరల ఆర్డర్లను వెంటనే ఇవ్వాలని కోరారు. 10 శాతం యారన్ సబ్సిడీని కార్మికుల ఖాతాల్లో జమచేయాలని కోరారు. సోమ నాగరాజు, గాజుల లింగం, రాజమల్లు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాల ఏకలవ్య గురుకులం విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో సత్తాచాటారు. 35 మంది విద్యార్థులు పాల్గొనగా 17 పతకాలు వచ్చాయి. ఈనెల 11 నుంచి 14 వరకు ఒడిశాలో జరిగిన జాతీయస్థాయి క్రీడల్లో 22 విభాగాల్లో పోటీపడ్డారు. వివిధ క్రీడల్లో 8 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్, 6 బ్రౌంజ్ పతకాలు సాధించినట్లు పాఠశాల పీఈటీ ఆనంద్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
వేములవాడరూరల్/చందుర్తి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి, వెంకటాంపల్లి, నమిలిగుండుపల్లి, చందుర్తి మండలం మూడపల్లి, ఆశిరెడ్డిపల్లి, రామన్నపేట, చందుర్తి, మల్యాల, నర్సింగపూర్, కిష్టంపేట, జోగాపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం కొంటుందన్నారు.


