సమన్వయంతో పనిచేయండి
అభివృద్ధి పనులకు స్థలాలు గుర్తించాలి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడలో అభివృద్ధి పనులపై సమీక్ష
హాజరైన ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
వేములవాడ: అధికారులు అందుబాటులో ఉంటూ, సమన్వయంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, గృహనిర్మాణ, మిషన్ భగీరథ శాఖల అధికారులతో మున్సిపల్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్‌తో కలిసి గురువారం సమీక్షించారు. లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి మంజూరైన 220/11, 133/11 ఒక్కో సబ్‌స్టేషన్, పదకొండు 33/11 సబ్‌స్టేషన్ల పనులపై ఆరా తీశారు. రైతు విజ్ఞాన కేంద్రం కోసం 50 ఎకరాలు గుర్తించాలని సూచించారు.
● రూ.15 కోట్లతో చేపట్టిన గ్రామపంచాయతీలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణాలపై ఆరా తీశారు. ఇంకా ప్రారంభం కాని బీటీ, సీసీ రోడ్ల పనులు త్వరగా చేపట్టాలని ఆదేశించారు.
● మూలవాగు వంతెన పనుల భూసేకరణకు రూ.6.90కోట్లు కేటాయించామని, త్వరగా పనులు చేపట్టాలని ఆదేశించారు. మోత్కురావుపేట–చందుర్తి రోడ్డుకు అటవీశాఖ అనుమతి వచ్చిందని, రూ.24కోట్లతో పనులు పూర్తి చేయనున్నామన్నారు. మూలవాగు, పెంటివాగుపై బ్రిడ్జీలకు ప్రతిపాదనలు పంపాలన్నారు.
● ఎల్లంపల్లి పరిధిలో 10 చెరువులకు మర్రిపల్లి, లచ్చపేట, కలికోట సూరమ్మ పనులు పురోగతిలో ఉన్నాయని ఈఈ శాంతయ్య తెలి పారు. మల్కపేట ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి 700 ఎకరాలు అవసరమని జిల్లా నీటి పారుదలశాఖ అధికారి కిశోర్‌కుమార్ తెలిపారు.
● నియోజకవర్గంలో 1,957 ఇందిరమ్మ ఇండ్లకు మార్కింగ్ చేశామని, 1,482 వివిధ దశల్లో ఉన్నాయని, 12 పూర్తయ్యాయని హౌసింగ్ అధికారులు తెలిపారు.
● వేములవాడ రాజన్న ఆలయం ద్వారా ఏటా రూ.186 కోట్ల ఆదాయం వస్తుందని, అదే స్థాయిలో భక్తులకు వసతులు కల్పించేందుకు అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు విప్ తెలిపారు.
● అగ్రహారంలోని మిషన్ భగీరథ గ్రిడ్‌ప్లాంట్ నిర్వహణపై ఆరా తీశారు. 9 మోటార్లు అందుబాటులో ఉన్నాయని, వేసవి రానున్నందునా ముందస్తుగా స్టాండ్ బై మోటార్లు ఉంచాలని ఆదేశించారు.
● మిడ్‌మానేరును పూర్తి స్థాయిలో నింపడంతో భూములు మునిగిపోతున్నాయని 318 అడుగుల వరకు నింపినట్లు తెలిపారు. మరోసారి సర్వే చేసి హద్దులకు రాళ్లు, చెట్లు పెట్టాలని ఆదేశించారు. మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
● వట్టిమల్ల, నిమ్మపల్లి వద్ద ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ కోరారు. రుద్రంగికి రూ.42కోట్లతో ఏటీసీ మంజూరైందని, 20వేల మెట్రిక్ టన్నుల గోదాములు మంజూరయ్యాయని వివరించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రూ.200 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పనులు వేగంగా పూర్తి చేయాలి
నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. వివిధ అభివృద్ధి పనులకు స్థలాలు వెంటనే గుర్తించాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్డీవోలు రాధాభాయ్, శేషాద్రి పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ప్రారంభం
వేములవాడకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ విస్తరణ నేపథ్యంలో భీమేశ్వరాలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలు, మొక్కులు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈక్రమంలో భక్తుల భద్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ప్రారంభించారు. 32 సీసీ కెమెరాలు, 15 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి, టౌన్ సీఐ వీరప్రసాద్, ఈఈ రాజేశ్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న విప్ ఆది శ్రీనివాస్
హాజరైన అన్ని శాఖల అధికారులు
సమన్వయంతో పనిచేయండి


