పల్లె పోరు సందడి
పంచాయతీ ఎన్నికల స్వరూపం
● జీపీల్లో ఓటరు జాబితా ప్రదర్శన ● రేపటిలోగా అభ్యంతరాలకు అవకాశం ● రిజర్వేషన్లపై ఆసక్తి
సిరిసిల్ల: గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఓటర్ల జాబితాను వెల్లడించడంతో స్థానికసంస్థల ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. జిల్లా అధికారులు ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రదర్శించారు. అవసరం మేరకు గుజరాత్ నుంచి బ్యాలెట్ బ్యాక్స్‌లు తెప్పించుకున్నారు.
గ్రామం యూనిట్‌గా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికలకు గ్రామం యూనిట్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. వార్డులవారీగా ఓటర్ల విభజన, ఒక్క కుటుంబంలోని ఓటర్లు ఒకే వార్డులో ఉండేలా విభజించారు. 200 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 1,734 ఉండగా.. 400 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 468, 650 మంది వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలు 66 ఉన్నాయి. 650 మంది కంటే ఎక్కువ ఉంటే.. రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
రిజర్వేషన్లపైనే ఆసక్తి
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల రిజర్వేషన్లు వర్తిస్తాయా? మారుతుందా? అనే దానిపై చర్చ సాగుతోంది. ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. కో ర్టు జోక్యంతో ఎన్నికల షెడ్యూల్ నిలిచిపోయింది. ఈనేపథ్యంలో రిజర్వేషన్లు మారుతాయా? అనే చర్చ సాగుతోంది. రిజర్వేషన్లు అనుకూలిస్తే బరిలో నిలిచేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను సమీకరించుకుంటూ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏది ఏమైనా పల్లెపోరుకు రంగం సిద్ధమైంది.
మండలాలు: 12, గ్రామపంచాయతీలు: 260
వార్డులు: 2268, ఓటర్లు: 3,46,259
మహిళా ఓటర్లు: 1,78,553
పురుష ఓటర్లు: 1,67,686
థర్డ్ జెండర్ ఓటర్లు: 20


