ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం చేసిండ్రు
● ఎన్నికల హామీని విస్మరించారు ● సిరిసిల్లలో కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సిరిసిల్ల: రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల బతుకులను ఆగం చేసిండ్రని, ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆటోడ్రైవర్ల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్ పేర్కొన్నారు. జిల్లాలోని ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు సొంత ఖర్చులతో బీమా చేయిస్తానని హామీ ఇవ్వడంపై ఆటో డ్రైవర్లు నేతన్నచౌక్‌లో కేటీఆర్ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఏటా రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, రెండేళ్లుగా ఒక్కో ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.24వేలు బాకీ పడిందన్నారు. ఉచిత బస్ పుణ్యమా అని ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పిల్లి నాగరాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


