
పంట నష్టం.. రైతు కష్టం
● అన్నదాతల శ్రమ వరదపాలు ● 561 ఎకరాల్లో పంటనష్టం ● ‘సెస్’కు రూ.50లక్షల మేరకు నష్టం ● ప్రాథమిక అంచనాల్లోనే అధికారులు
కొట్టుకుపోయిన వరి చేనును చూస్తున్న ఇతను ఉప్పలాయ చిన్ననర్సయ్య. గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన చిన్ననర్సయ్య వరిపొలం ముదురు కలుపునకు వ చ్చింది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఎగువమానేరు నిండి మత్తడి పోయడంతో ఎకరంన్నర పొలం కొట్టుకుపోయింది.
సిరిసిల్ల: ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముదురు కలుపునకు వచ్చిన వరిపంట కొట్టుకుపోయింది. వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 341 మంది రైతులు 561 ఎకరాల్లో వరిపంట నష్టపోయినట్లు లెక్క కట్టారు. వ్యవసాయాధికారుల అంచనాల్లో పత్తి పంట లెక్కలోకి రాలేదు. పత్తి పంటను లెక్కలోకి తీసుకుంటే పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. వరద తెచ్చిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఏడు మండలాల్లో తీవ్ర నష్టం
గంభీరావుపేట, కోనరావుపేట, బోయినపల్లి, ము స్తాబాద్, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, వేములవా డరూరల్ మండలాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. వరి కోతకు గురికాగా.. పత్తి నీట ముని గింది. మానేరు, మూలవాగుల వెంట ఉన్న గ్రామాల్లో పంటభూములు కోతకు గురయ్యాయి. రైతులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.
కూలిన ఇళ్లు.. రాలిన కన్నీళ్లు
పాత ఇళ్లు కూలిపోయాయి. నిలువ నీడ లేక నిర్వాసితులు దిక్కులు చూస్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోనూ సిమెంట్, సలాక పిల్లర్ గొయ్యిల్లో మునిగిపోయాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా పంటలే కాకుండా భారీ వర్షాలతో ఆస్తి నష్టాలు జరిగాయి. క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది గంభీరావుపేట మండలం నర్మాల–కోళ్లమద్ది మధ్య లోలెవల్ వంతెన వద్ద విద్యుత్ స్తంభాలు వంగిపోయిన ప్రదేశాన్ని ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, గంభీరావుపేట ‘సెస్’ డైరెక్టర్ నారాయణరావు, ఏడీఈ శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. వంగిన స్తంభాలను, నేలపై పడిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను, విద్యుత్ తీగలను బాగు చేసేందుకు రూ.50లక్షల మేరకు ఖర్చు అవుతుందని ‘సెస్’ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తంగళ్లపల్లి మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కూలిపోయింది.
ఇది రోడ్డు అనుకుంటున్నారా.. వరదలకు కొట్టుకుపోయింది అనుకుంటున్నారా.. అసలే కాదు. ఎగువమానేరు మత్తడిపోయడంతో నర్మాల వద్ద కొట్టుకుపోయిన పంట పొలం.

పంట నష్టం.. రైతు కష్టం

పంట నష్టం.. రైతు కష్టం

పంట నష్టం.. రైతు కష్టం