
ఠాణాకు చేరిన చేపల చెరువు పంచాయితీ
చందుర్తి(వేములవాడ): రెండు జిల్లాల సరిహద్దు మండలాల మధ్య ఉన్న చేపల చెరువు పంచాయితీ చందుర్తి ఠాణాకు చేరింది. చందుర్తి మండలం కొత్తపేట, జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తుర్తికి చెందిన గ్రామస్తులకు కొద్ది రోజులుగా రెండు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలోని తీగలకుంట చెరువు వివాదాస్పదంగా మారింది. కొత్తపేటకు చెందిన ముదిరాజ్‌లు ఈ చెరువుపై ఏళ్లుగా తమకే హక్కు ఉందంటూ చందుర్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కథలాపూర్ మండలం తుర్తికి చెందిన ముదిరాజ్‌లను పోలీసులు శనివారం పిలిపించగా తాము కూడా ఈ చెరువులోనే చేపలు పట్టుకుంటున్నామని తెలిపారు. ఇరు వర్గాలు కలిసి సరిహద్దు సర్వే చేయించుకోవాలని ఎస్సై రమేశ్ సూచించారు. హద్దులు తేలే వరకు చెరువులోకి వెళ్లవద్దని స్పష్టం చేశారు. ఈమేరకు ఇరు గ్రామాల వారు అంగీకరించారు.