
అన్నపూర్ణలోకి 4 పంపులతో ఎత్తిపోతలు
● ప్రాజెక్టు చరిత్రలో తొలిసారి ● ప్రస్తుత నీటి నిల్వ 1.41 టీఎంసీలు
ఇల్లంతకుంట(మానకొండూర్): అన్నపూర్ణ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత తొలిసారి శనివారం నాలుగు పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నారు. మల్లన్నసాగర్ పనులు పూర్తి కావడంతోనే నాలుగు పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ–10లో భాగంగా ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద అన్నపూర్ణ ప్రాజెక్టును 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. రిజర్వాయర్ నిర్మాణంలో అనంతగిరి, కొసగుట్టపల్లి గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. సోమారంపేట, అల్లీపూర్, ఎల్లయ్యపల్లి గ్రామాల్లోని భూములు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టు కింద 30వేల ఎకరాల ఆయకట్టు ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లో ఉంది. ప్రాజెక్టుకు ఉన్న మెయిన్ కెనాల్‌కు ఏడు మైనర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి.
12,800 క్యూసెక్కులు
మిడ్‌మానేరు నుంచి నాలుగు పంపులతో 12,800 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణలోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి న ఉంచి రంగనాయకసాగర్‌లోకి 9,900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఒక్క రోజు నాలుగు పంపుల ద్వారా ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అన్నపూర్ణ ప్రాజెక్టులో 1.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పంపుల ప్రారంభోత్సవంలో ఇరిగేషన్ ఎస్‌ఈడీ రవీందర్‌రెడ్డి, డీఈఈ ప్రతాపరెడ్డి, ఏఈఈలు నాగేందర్, సమరసేన, వంశీ, నాగేశ్వరరావు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.