
సాహిత్యంతో చిన్నారుల్లో సృజనాత్మకత
● ‘మామిడిపండ్ల గంప’ కథ సంపుటి ఆవిష్కరణ ● బందనకల్ బడిపిల్లల కథలు
ముస్తాబాద్(సిరిసిల్ల): సాహిత్యంతో చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొంది భవిష్యత్‌లో అనేక రంగాల్లో రాణిస్తారని ఎంపీడీవో లచ్చాలు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం బందనకల్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాసిన ‘మామిడిపండ్ల గంప’ కథ సంపుటిని శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నేడు విద్యార్థులు కంప్యూటర్, డిజిటల్ ప్రపంచంలో మునిగి గ్రామాలు, పల్లెలను మరచిపోతున్నారన్నారు. వారిలో కృత్రిమత్వం పెరిగి ఆవిష్కరణలకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో బందనకల్ విద్యార్థులు 23 కథలను రాయడం అభినందనీయమని పేర్కొన్నారు. సాహిత్యం, గేయం, కథలు బతికి ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమన్నారు. విద్యార్థులను ప్రోత్సహించిన హెచ్‌ఎం రాజ్‌కుమార్, ఉపాధ్యాయుడు చారిని అభినందించారు. ఎంఈవో రాజిరెడ్డి, క్లస్టర్ హెచ్‌ఎం రాధాకిషన్‌రావు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, హెచ్‌ఎం రాజ్‌కుమార్, సాహితీవేత్త గరిపెల్లి అశోక్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, తుపాకుల రవి పాల్గొన్నారు.