
బ్రాండెడ్ సైకిళ్లు ఇస్తున్నా
● కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
వేములవాడ: బతుకమ్మ చీరల్లా కాదు.. బ్రాండెడ్ సైకిళ్లు అందజేస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. తనకు ఓట్లు వేసింది పెద్దవాళ్లే అయినప్పటికీ వేయించింది చిన్నారులేనన్నారు. రాష్ట్రంలో 150 రోజులు 1600 కిలోమీటర్లు చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో రైతులు, విద్యార్థులు, మహిళలు పడుతున్న కష్టాలు చూశానన్నారు. గత ప్రభుత్వం విద్య కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయించిందని తెలిపారు. ఎంపీగా గెలవడం కాదు, నియోజకవర్గంలో గొప్ప కార్యక్రమం చేయాలన్న ప్రధాని మోదీ సూచనతో సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తలదించుకొని చదివితే భవిష్యత్‌లో తల ఎత్తుకొని బతుకుతారన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆర్డీవో రాధాభాయి, రెడ్డబోయిన గోపి, వికాస్‌రావు, ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు.