
శాంతియుతంగా నవరాత్రులు
● విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ● ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి ● పక్కా ప్రణాళికతో నిమజ్జనం ● గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై ఎస్పీ మహేశ్ బి గీతే
సిరిసిల్లక్రైం: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా ముగిసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. మండప నిర్వాహకులు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, భక్తిభావంతో ఉత్సవాలు సాగేలా సహకరించాలని కోరారు. మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని, అన్ని వర్గాల సమన్వయంతో ఉంటే ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకుంటామన్నారు. నేటి నుంచి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎస్పీ మహేశ్ బిగీతేతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.
వెయ్యికి పైగానే మండపాలు
జిల్లాలో ఇప్పటి వరకు 800 వరకు గణేశ్ మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైంది. మరో 300 వరకు మండపాల నమోదయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా గల్లీలు, పల్లెల్లో ఉండే వినాయకులు అదనం. విలేజ్ పోలీస్ ఆఫీసర్ సమక్షంలో వివరాలు పొందుపరిచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆన్‌లైన్ నమోదుతో నిమజ్జనం వరకు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.
రక్షణ చర్యలు పాటించండి
వినాయక మండపాల నిర్వహణ తీరుపై ఇప్పటికే సమన్వయ కమిటీ సమీక్ష నిర్వహించాం. మండపంలో విద్యుత్ కోసం సెస్ అధికారులను సంప్రదించాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా నీళ్లు, ఇసుకబకెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతీ మండపంలో జరుగుతున్న అంశాలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించాం.
డీజేలు నిషేధం
అధిక శబ్దం ఇచ్చే స్పీకర్లు, డీజేలు నిషేధం. ఇప్పటికే అన్ని ఠాణాల పరిధిలో అవగాహన కల్పించాం. ఉత్సవాలు సంప్రదాయ పద్ధతిలో చేసుకోవాలి. అధిక శబ్దం వచ్చే స్పీకర్లతో ఆయా ప్రాంతాల్లోని వృద్ధులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తాయి. ఈ విషయాన్ని కూడా మండపాల నిర్వాహకులకు తెలియజేశాం. మండపాల వద్ద రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి స్పీకర్లు వినియోగించొద్దని స్పష్టం చేశాం.
నిమజ్జనంపై ప్రణాళికతో..
నవరాత్రులపాటు పూజలు అందుకున్న గణేశ్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. సిరిసిల్ల బ్రిడ్జి, వేములవాడ గుడి చెరువు నిమజ్జన స్థలాలుగా గుర్తించాం. అవసరమైన మేరకు క్రేన్లు అందుబాటులో ఉంచుతాం. అన్ని శాఖల సమన్వయంతో వినాయక నవరాత్రులను విజయవంతంగా ముగించేందుకు కృషి చేస్తాం.
సామాజిక మాధ్యమాలపై నిఘా
మతం, ప్రాంతాలవారీగా ఏదైనా శాంతిని భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో మెసేజెస్ ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని సరైన క్రమంలో అర్థం చేసుకోకుండా ఇష్టారీతిగా పంపితే కఠిన చర్యలు తీసుకుంటాం.
బందోబస్తులో పోలీస్ బలగం
వినాయక నవరాత్రులను జిల్లా ప్రజలు ఆనందాల మధ్య జరుపుకునేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తుంది. 150 మంది పోలీస్ అధికారులతోపాటు మరో 450 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. డయల్ 100, సంబంధిత పోలీస్ స్టేషన్ నంబర్‌తో అత్యవసర సేవలు పొందవచ్చు.

శాంతియుతంగా నవరాత్రులు