
వినాయక.. రాకపోక కష్టమే!
మీరు చూస్తున్న ఈ రోడ్డు ఇందిరానగర్. జిల్లా కేంద్రంలోని సాయినగర్ ప్రధాన రహదారి నుంచి మార్కెట్‌పల్లితోపాటు కార్మికవాడలకు వెళ్లే రోడ్డు. ఇక్కడ సీసీ రోడ్డు పూర్తిగా పాడయింది. సుమారు 100 గజాల దూరం వరకు పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు వేయాలని ఏళ్లుగా స్థానికులు విన్నవిస్తున్నా పట్టించుకునే వారు లేరు.
ఇది జిల్లా కేంద్రంలోని కార్మికవాడ పద్మనగర్. ఈ ఏరియాలో అధిక సంఖ్యలో భారీ వినాయకులు ఏర్పాటు చేస్తుంటారు. తాగునీటి పైపులైన్ కోసం రోడ్డును తవ్వగా ఇలా ధ్వంసమైంది. చాలా రోజులుగా ఇలాగే ఉంటన్న రోడ్డుపై ప్రయాణించే వారికి ఇబ్బందిగా మారింది. వినాయక నిమజ్జనం సమయానికై నా రిపేరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సిరిసిల్లటౌన్: మోకాలు లోతు గుంతలు.. శిథిల రహదారులు వినాయకులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ప్రమాదాలు జరిగేలా రోడ్లు ధ్వంసమయ్యాయి. పట్టణ ప్రజలు గణేశ్ నవరాత్రోత్సవాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపు 20 అడుగుల భారీ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పట్టణంలోని రహదారులు శిథిలమై.. వినాయకుల రాకపోకలకు కష్టంగా మారాయి. అంత భారీ విగ్రహాలను అధ్వానంగా మారిన రోడ్లపై ఎలా తీసుకురావాలో తెలియక నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. రోడ్ల మరమ్మతుకు ఏటా నిధులు మంజూరు చేస్తున్నా మళ్లీ అవే తిప్పలు ఎదురవుతున్నాయి.
విలీనంలోనూ ఇబ్బందులే..
సిరిసిల్ల పట్టణంతోపాటు పెద్దూరు, సర్దాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, రాజీవ్‌నగర్, చంద్రంపేట, రగుడు విలీన గ్రామాల్లోనూ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పట్టణంలోని కార్మికవాడలు, శివారు ప్రాంతాలు మరీ అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటికై నా రోడ్లను మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కొన్ని ఏరియాల్లో లూజువైర్లు, తక్కువ ఎత్తులో ఉన్న కరెంటు తీగలను సరిచేయాలని సెస్ అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.
అంతర్గత రోడ్లు మరమ్మతు చేయిస్తాం
సిరిసిల్ల పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లు బాగానే ఉన్నాయి. వినాయక నిమజ్జన పనల్లో భాగంగా అంతర్గత రోడ్లు మరమ్మతు చేయిస్తాం. అన్ని కాలనీల నుంచి వినాయకులను సజావుగా నిమజ్జన పాయింట్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నిమజ్జన ఖర్చులను ఎస్టిమేషన్ పూర్తిచేసి నిధులను కేటాయిస్తాం.
– ఎంఏ ఖదీర్ పాషా, మున్సిపల్ కమిషనర్

వినాయక.. రాకపోక కష్టమే!

వినాయక.. రాకపోక కష్టమే!