
కాపీ రాయుళ్లా.. మజాకా?
ఎస్‌యూ పరిధిలో జోరుగా చూచిరాతలు
దొరికాక రాజకీయ నేతలతో ఫోన్లు
మా వారినే డీబార్ చేస్తారా అంటూ రంగంలోకి లీడర్లు
డ్యూటీ చేస్తే ఒత్తిళ్లా అంటూ వాపోతున్న సిబ్బంది
వెనకడుగు వేస్తే ప్రతిఘటిస్తామంటున్న విద్యార్థి సంఘాలు
జరిగిన వ్యవహారంపై ఆరా తీసిన ఇంటెలిజెన్స్
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
శాతవాహన వర్సిటీ పరిధిలో జరుగుతున్న న్యాయపరీక్షల్లో పట్టుబడుతున్న కాపీరాయుళ్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల డిగ్రీ పరీక్షల్లో డీబార్ అయిన ఓ విద్యార్థికి మద్దతుగా ఉత్తరాదికి చెందిన ఓ సీనియర్ మంత్రి ఫోన్ చేసిన విషయం మరవకముందే.. అదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయి. యథేచ్ఛగా చిట్టీలు పెట్టి రాస్తూ.. వర్సిటీ సిబ్బంది పట్టుకుంటే ఒత్తిళ్లు తెస్తూ.. బెదిరిస్తున్నారు. వినకపోతే ఆఖరి అస్త్రంగా రాజకీయ నాయకులను రంగంలోకి దించుతున్నా రు. వర్సిటీలో ఇటీల జరిగిన కొన్ని పరిణామాలు సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉండటం చర్చానీయాంశంగా మారింది. ఓ ‘లా’ విద్యార్థి ఈనెల 18న కాపీ కొడుతూ వర్సిటీలో దొరికిపోయాడు. వదిలేయాలని కోరాడు. సిబ్బంది వినలేదు. దీంతో పలువురు రాజకీయ నాయకులతో ఫోన్ల మీద ఫోన్లు చేయించడం ప్రారంభించాడు. అప్పటికే అతన్ని డీబార్ చేసిన అధికారులు తామేం చేయలేమని చేతులెత్తేశారు. మరో ఘటనలో నగరానికి చెంది ఓ పార్టీ నాయకుడు నామినేటెడ్ పోస్టులో కొనసాగుతున్నాడు. అతను కూడా లా పరీక్షలో కాపీ కొడు తూ దొరికిపోయాడు. ఈయన సైతం సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కాపీ కొడుతూ దొరికిన సంగతి మరిచి, తనను వదిలేయాలంటూ వాదించసాగాడు. యూనివర్సిటీ సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా అతన్ని డీబార్ చేసేశారు. ఒక్క పరీక్షలో దొరికి డీబార్ అయినా నిబంధనల ప్రకారం.. మొత్తం సెమిస్టర్ పరీక్షలన్నీ వచ్చే ఏడాది రాసుకో వాలి. ఉదాహరణకు ఒక సెమిస్టర్‌లో ఐదు పేపర్లు ఉన్నాయనుకుంటే.. అందులో ఆఖరు పేపరు రోజు కాపీ కొట్టి దొరికితే.. మొత్తం పరీక్షల్లో డీబార్‌గా ప్రకటిస్తారు. దీంతో మొత్తం పేపర్లు మరో ఏడాది వరకు రాసుకోవాలి.
వారం దాటినా ఆగని ఫోన్లు
వాస్తవానికి ఆ ఒత్తిళ్ల వ్యవహారం ఆ ఒక్కరోజుతో ముగిసిపోలేదు. సదరు అధికారులకు వారం రోజులైనా ఆగలేదు. ‘మా వాడిని కొంచెం చూడండి.. డీబార్ రద్దు చేయండి’ అంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి, సెలవు దినం తేడా లేకుండా ఫోన్లు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నా రు. వాస్తవానికి నిబంధనల ప్రకారం.. ఒకసారి డీబార్ చేసిన తరువాత దాన్ని ఎత్తేయడం అంటూ ఉండదు. ఇదే విషయాన్ని ఫోన్ చేసే వారికి వివరించినా అర్థం కావడం లేదంటూ వర్సిటీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు వీరి వ్యవహా రం తెలిసి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వర్సిటీ సిబ్బందికి ఫోన్లు చేయడం ప్రారంభించాయి. డీబార్ ఎత్తివేస్తే ఊరుకునేది లేదని, వర్సిటీ ఎదుటే ఆందోళనకు దిగుతామంటూ స్పష్టం చేశాయి. దీంతో సిబ్బంది ఇటు కాపీరాయుళ్లు, అటు విద్యార్థి సంఘాల మధ్య నలిగిపోతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఇంటెలిజెన్స్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు రంగంలోకి దిగి.. అసలేం జరిగిందో తెలుసుకుని, ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఇది చాలా సాధారణ విషయం
వాస్తవానికి వర్సిటీలో ఈ ఘటన ఈనెల 18న జరిగింది. చాలా సాధారణ విషయం. కొందరు దీన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నారు. సహజంగానే ఈ రోజుల్లో న్యాయపరీక్షలకు ఉన్నత స్థాయి ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, డాక్టర్లు, రెవెన్యూ తదితరులు హాజరవుతున్నారు. పరీక్షల్లో కొందరు కాపీ కొడుతూ దొరకడం, వారికి మద్దతుగా రాజకీయ నాయకులు, వీఐపీలు ఫోన్లు చేయడం మాకు షరా మామూలే. – సురేశ్, కంట్రోలర్, ఎస్‌యూ