
వాగు ఉధృతి.. తెగిన రోడ్డు
గంభీరావుపేట(సిరిసిల్ల): ‘మళ్లీ వానాకాలం వచ్చింది.. మన రోడ్డు కొట్టుకుపోవడం ఖాయం.. బ్రిడ్జి కట్టరు.. మన కష్టాలు తీర్చరు’.. అంటూ కొద్దిరోజులుగా గంభీరావుపేట మండలంలోని ఏ గ్రామంలో విన్న ఇవే మాటలు. అన్నట్లుగానే గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు మంగళవారం మత్తడి పోస్తోంది. దీంతో వాగు ఉధృతి పెరిగింది. కాగా, గంభీరావుపేట మండలకేంద్రంలో మానేరు వాగుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు తెగిపోయింది. ఈక్రమంలో మండలకేంద్రానికి రాకపోకలు ఈ మార్గం గుండా నిలిచిపోయాయి. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనుల సందర్భంగా పాత బ్రిడ్జి కూల్చివేసి తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. పనుల్లో జాప్యం జరుగుతోంది. అంతలోనే వానాకాలం వచ్చి వరద ఉధృతికి మట్టిరోడ్డు తెగిపోయింది. మండలంలోని సగానికిపైగా గ్రామాల ప్రజలు లింగన్నపేట, మల్లారెడ్డిపేట గ్రామాల మీదుగా కిలోమీటర్ల దూరం తిరిగి మండలకేంద్రానికి రావాల్సి వస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.