
సాంకేతికతను వినియోగించుకోవాలి
సిరిసిల్లకల్చరల్: నేర విచారణలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచించారు. మంగళవారం ప్రోబ్ ఫోరెన్సిక్ లాబొరేటరీ ఆధ్వర్యంలో న్యాయవాదులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయవాదులు అధునాతన విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం అర్హులైన న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులు అందజేశారు. ప్రోబ్ లేబొరేటరీ ప్రతినిధి మోహన్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోజనాలను వివరించారు. నేరం జరిగిన స్థలం నుంచి సేకరించిన ఏ రకమైన జీవ సంబంధ ఆధారాన్ని అయినా సమూలంగా విశ్లేషించే సామర్థ్యం ఫోరెన్సిక్ సైన్స్ వల్ల సాధ్యపడుతోందన్నారు. రక్తం, వీర్యం, వెంట్రుకలు తదితర జీవ సంబంధ ఆనవాళ్లను శాసీ్త్రయంగా విశ్లేషించి నేరస్తులను నిర్ధారించడంలో దోహదపడుతోందన్నారు. సీనియర్ న్యాయవాదులు ఎస్.వసంతం, గోవిందు భాస్కర్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.