
భూకబ్జాల బాగోతం బహిర్గతం చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: జిల్లాలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జా బాగోతాన్ని బహిర్గతం చేసి ఇప్పటి వరకు ఎన్ని రికవరీ చేశారో ప్రజలకు వివరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కలెక్టర్‌ను కోరారు. ఈమేరకు సిరిసిల్లలోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సిరిసిల్ల నియోజకవర్గంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుచరులు సుమారు 2 వేల నుంచి 3వేలు ఎకరాల వరకు కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. వారిలో కొందరిపై కేసులు పెట్టారని, కొంత మేరకు భూమి రికవరీ చేశారన్నారు. అయితే ఈ వ్యవహారంలో చిన్నా చితక వ్యక్తులపైనే చర్యలు తీసుకుంటూ, బడా నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ముస్తాబాద్ మండలంలోని సర్వేనంబర్లు 410, 608లో సుమారు 150 ఎకరాలు కబ్జాకు గురయ్యాయన్నారు. వీటిలో 50 ఎకరాల్లో స్ట్రోన్‌క్రషర్ నడుస్తోందని పేర్కొన్నారు. సిరిసిల్ల కొత్తచెరువు డీసీఎంహెచ్‌వో పరిధిలో ఎంత భూమి కబ్జాకు గురైందో కలెక్టర్ విచారణ చేపట్టి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ స్పెషలాఫీసర్‌గా కలెక్టర్ ఉన్నా పట్టణంలో అనేక అక్రమ లేఅవుట్లు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు వివరణ ఇవ్వకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్టీ పార్లమెంటు కోకన్వీనర్ ఆడెపు రవీందర్, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, గజభీంకార్ చందు, తిరుపతిరెడ్డి, శ్రీహరి, శ్రీధర్, శ్రీనివాస్, దేవరాజు, శేఖర్, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.