
ఇక.. లెక్క పక్కా!
● కాలేజీల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ● సదుపాయాల కల్పనకు నిధులు ● 10 కళాశాలలకు రూ.1.80కోట్లు ● కమిటీల ఆధ్వర్యంలో నిధుల ఖర్చు
చందుర్తి(వేములవాడ): ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతుల కల్పన.. నిధుల ఖర్చు.. విద్యాబోధన పర్యవేక్షణకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. నిధుల కేటాయింపు.. నిర్వహణకు పాఠశాలల మాదిరిగా అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వసతుల కల్పనకు రూ.1.80కోట్లు కేటాయించింది. ఈ నిధుల నిర్వహణ, కమిటీలు చేసుకునే బాధ్యతను వారికి అప్పగించనున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కమిటీ చైర్మన్‌గా, కన్వీనర్‌గా స్వశక్తి సంఘం సభ్యురాలు, కళాశాలలో విద్యను అభ్యసించే ఆరుగురు విద్యార్థుల తల్లులు, కళాశాలలోని మరో ముగ్గురు సీనియర్ అధ్యాపకులతో కమిటీ ఏర్పాటు చేస్తారు.
వసతుల కల్పనపై దృష్టి
కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మూత్రశాలల పునరుద్ధరణ, నిర్మాణాలు, నిర్వహణ, తరగతి గదుల్లో విద్యుత్ సదుపాయం, పారిశుధ్య నిర్వహణ, భవనాలకు రంగులు తదితర పనులపై ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
10 కళాశాలలకు రూ.1.80 కోట్లు
జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.1.80కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి ద్వారా వసతులు కల్పించనుంది.