
మీ గెలుపు కోసం పనిచేస్తా
● ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే ● బీఆర్‌ఎస్ శ్రేణులతో కేటీఆర్
సిరిసిల్ల: మీ గెలుపు కోసం నేను పనిచేస్తా.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే విజయం మనదేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఆదివారం బీఆర్‌ఎస్ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ గత పదేళ్లలో మండటెండల్లోనూ సిరిసిల్ల మానేరు నిండుగా పారేదని, కాంగ్రెస్ వచ్చాక ఎడారిలా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పోలీసు కేసులు పెట్టడం, జైలుకు పంపడం అన్నట్లుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. అని కేసీఆర్‌కు ఓటు వేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. 20 నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదన్నారు .
ప్రజాసమస్యలపై పోరాటం
బీఆర్‌ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, తమ పరిధిలోని సమస్యలపై ఉద్యమించాలని కేటీఆర్ దిశనిర్దేశం చేశారు. యూరియా కొరతతో కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే ముఖం లేకుండా పోయిందన్నారు. విద్యుత్ బిల్లులు సబ్సిడీ ద్వారా చెల్లించాలని వస్త్రవ్యాపారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో విజయం బీఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ‘సెస్’ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, గ్రంథాలయసంస్థ మాజీ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు అడ్డగడ్ల మురళి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, పార్టీ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు ఎండీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.