
మహిళలు వ్యాపారంలో రాణించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్: మహిళలు వ్యాపారంలో రాణించాలని, మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం బొల్లారంలో శనివారం ఇందిరా మహిళాశక్తి కింద శ్రీశివరామ గ్రామ సమాఖ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాలు దుకాణాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి శనివారం ప్రారంభించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో మహిళా సంఘాలకు రైస్‌మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఆర్డీవో శేషాద్రి, మండల వ్యవసాయాధికారి వినీత తదితరులు పాల్గొన్నారు.
చందుర్తి(వేములవాడ): స్వశక్తి సంఘాల మహిళలు వ్యాపారాలతో ఆర్థిక స్వావలంబన సాధించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. చందుర్తిలోని స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు విమర్శలు చేయొద్దని సూచించారు. ఆగ్రోస్ కేంద్రాలు, సింగిల్‌విండోలు ఉన్నా.. రైతులకు మరింత చేరువ చేయాలని స్వశక్తి సంఘాల మహిళలతో ఎరువుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, సనుగుల సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, డీఆర్‌డీఏ శేషాద్రి, వ్యవసాయాధికారి దుర్గారాజు, ఏపీఎం ప్రకాశ్ పాల్గొన్నారు.