
దివ్యాంగులకు అండగా నిలవాలి
● పెట్రోల్‌బంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు అండగా నిలవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. రెండో బైపాస్ రోడ్డులోని పెద్దూరు మెడికల్ కాలేజీ–అపెరల్ పార్క్ వద్ద జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసిన దివ్యాంగుల పెట్రోల్ బంక్‌ను శనివారం తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న దివ్యాంగులతో మాట్లాడారు. వారికి అందుతున్న జీతభత్యాలు, పనిగంటలు.. సాధక బాధకాలు తెలుసుకున్నారు. పెట్రోల్‌బంక్ టర్నోవర్ పెంచేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల వాహనాలకు ఇక్కడే డీజిల్, పెట్రోల్ పోయించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంకు సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలు ప్రణాళిక ప్రకారం ఎరువుల వ్యాపారం చేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలో విజయలక్ష్మీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని శనివారం ప్రారంభించారు. ఏఎంసీ చైర్‌పర్సన్ కొమిరిశెట్టి విజయ, డీఆర్‌డీవో శేషాద్రి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఏవో సలావుద్దీన్, ఐకేపీ ఏపీఎం దేవయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హమీద్, ఐకేపీ సీసీ లావణ్య పాల్గొన్నారు.