
ముసురుకుంది
● ఎగువ మానేరు, నిమ్మపల్లి మూలవాగుల్లోకి చేరుతున్న వరద ● వేములవాడలో అత్యధికంగా 33.3 మిల్లీమీటర్లు
సిరిసిల్ల: జిల్లాలో ముసురువర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కూడెల్లివాగులో కొద్దిగా వరద సాగుతోంది. ఆ వరదనీరు గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరులోకి చేరుతోంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాల్వంచవాగులోనూ వరద వస్తోంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ సరిహద్దు అడవుల్లో కురుస్తున్న వర్షాలతో కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోకి వరద నీరు చేరుతోంది. చలిగాలితో కూడిన వర్షం జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. ముసురు వర్షంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. నల్లరేగడి నేలల్లో కొద్దిగా నీరు నిలిచి పత్తి మొక్కలు ఎర్రబడే ప్రమాదం ఉంది. ఇంకా వరినాట్లు వేయని రైతులు ఈ వర్షాలతో వానాకాలం పంట సాగును వర్షంలోనూ పూర్తి చేస్తున్నారు.
వేములవాడలో అత్యధికంగా 33.3 మిల్లీమీటర్లు
జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. అత్యధికంగా వేములవాడలో 33.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముస్తాబాద్‌లో 30.2, చందుర్తిలో 23.6, రుద్రంగిలో 10.8, వేములవాడ రూరల్‌లో 13.6, బోయినపల్లిలో 6.7, సిరిసిల్లలో 12.4, కోనరావుపేటలో 11.8, వీర్నపల్లిలో 9.4, ఎల్లారెడ్డిపేటలో 9.8, గంభీరావుపేటలో 22.7, తంగళ్లపల్లిలో 12.6, ఇల్లంతకుంటలో 11.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 13 మండలాల్లో సగటు వర్షపాతం 16.0 మిల్లీ మీటర్లుగా నమోదైంది.