
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సోమవారం నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ చేతులు పరిశుభ్రంగా కడుక్కోకపోవడం, పాదరక్షలు లేకుండా మట్టిలో ఆడుకోవడం, బహిరంగ మలవిసర్జన చేయడం వంటి వాటితో నులిపురుగులు సంక్రమిస్తాయన్నారు. నులి పురుగులు కడుపులో చేరడంతో కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, ఆకలి లేకపోవడం, బలహీనత, రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి శారీరక మానసిక అభివృద్ధి మందగిస్తుందన్నారు. పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత, హెచ్‌ఎం సిలుముల శంకర్, తంగళ్లపల్లి పీహెచ్‌సీ వైద్యురాలు దీప్తి, ఏఎన్‌ఎంలు ప్రమీల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యానికి మించి ట్యాక్స్ వసూలు
సిరిసిల్ల: జిల్లాలో రవాణాశాఖ లక్ష్యానికి మించి ట్యాక్స్ వసూలు చేసిందని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సోమవారం తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 293 కేసులు నమోదు చేసి రూ.96.96 లక్షలు వసూలు చేశామని వివరించారు. జిల్లాకు రవాణాశాఖ రూ.64 లక్షల లక్ష్యం నిర్ణయించగా.. 151 శాతం మేరకు ట్యాక్స్ వసూలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇంకా ట్యాక్స్ చెల్లించని సరుకు రవాణా వాహనాలు, ట్రాక్టర్ ట్రైలర్లు, ఇతర వాహనాలు 5,088 ఉన్నట్లు వివరించారు. వాహన యజమానులు స్వచ్ఛందంగా చెల్లిస్తే ఎలాంటి జరిమానా ఉండదని, రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే 200 శాతం జరి మానా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, ఆఫీస్ నిర్వాహకురాలు కల్పన, సాంకేతిక సహా యకులు కరుణాకర్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి