
రియల్ ఢమాల్
సిరిసిల్ల: రెండేళ్లలోనే రియల్ ఎస్టేట్ తారుమారైంది. రాజన్నసిరిసిల్ల ఆవిర్భావంతో ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండేళ్ల వరకు జిల్లాలో ఎటూ చూసిన నూతన వెంచర్ల వెలుస్తూ కనిపించేవి. కానీ రెండేళ్లుగా ఉన్న వెంచర్లకే దిక్కులేదు. కొత్త వాటి ఊసే లేదు. ఇప్పటికే వెలసిన వెంచర్లలో ప్లాట్లు అమ్ముడు పోకపోవడంతో పెట్టుబడిదారులు అప్పులపాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
పెరిగి..పడిన ధరలు
సిరిసిల్ల పట్టణానికి రెండు వైపులా బైపాస్‌రోడ్లు రావడంతో ఆ ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వేములవాడ పట్టణం టెంపుల్ సిటీ కావడంతో చుట్టూరా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఇటీవల సిరిసిల్ల, వేములవాడ పట్టణాల చుట్టూ రియల్ ఎస్టేట్ దందాలు వెనక్కి తగ్గాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన భూముల విక్రయ ఒప్పందాలు రద్దవుతున్నాయి. ప్లాటు కోసం అడ్వాన్స్‌గా ఇచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాలని కొన్నవారు, ఇచ్చిన డబ్బులు వాపస్ ఇచ్చేది లేదు.. జరిమానా కింద అడ్వాన్స్‌గా డబ్బులు రద్దుగా భావించాలని అమ్మిన వారు గొడవకు దిగుతున్నారు. ఈ పంచాయితీలు అటు పోలీస్‌స్టేషన్‌కు, పెద్ద మనుషుల వద్దకు చేరుతున్నాయి.
అమ్మకాలు లేక..
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. 200 గజాల ప్లాటు కొనా లన్నా కనీసం రూ.15 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రాంతాన్ని బట్టి ధరలు ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి, బొప్పాపూర్ సర్కిల్ వద్ద గజం స్థలం రూ.లక్షల్లో ఉండడం విశేషం. అన్ని ప్రాంతాల్లో నివాస స్థలాల ధరలు ఎక్కువగా ఉండడంతో రీసేల్ ఆగిపోయింది. నిజానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల సంఖ్య ఎక్కువై.. వాళ్లే.. కమీషన్ల కో సం ధరలను పెంచుతూ వెళ్లారు. వాస్తవిక మార్కెట్ ధరలను దాటి లాభాల కోసం అమాంతం పెంచడంతో రియల్ ఎస్టేట్ దందా కుప్పకూలింది. ప్లాట్ల క్రయ, విక్రయాలు పెద్దగా జరగకపోవడంతో ఇప్పుడు స్థబ్తత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన వెంచర్లు పది లోపే ఉండగా.. లే– అవుట్ అనుమతి లేని వెంచర్లు వందల్లో ఉన్నాయి.
స్థల వివాదాలు
సిరిసిల్ల పట్టణ శివారు గ్రామాలు పెద్దూరు, రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగింది. ఒకప్పుడు తక్కువ ధరకే భూములు దొరకడంతో క్రయ, విక్రయాలు సాగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడంతో విక్రయాలు లేక.. ఆయా గ్రామాల్లో స్థల వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆ గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థబ్తత నెలకొంది. వేములవాడలో విలీనమైన తిప్పాపూర్, నాంపల్లి, కోనాయపల్లి, అయ్యోరుపల్లి, శాత్రాజ్‌పల్లిలోనూ ఇదే పరిస్థితి ఉంది. స్థల వివాదాలతో ప్లాట్ల క్రయ, విక్రయాలపై ప్రభావం ఉంది. రెండేళ్ల కిందట ఉన్న భూముల అమ్మకాలు, కొనుగోళ్ల సందడి ఇప్పుడు కనిపించడంలేదు.
ఇది సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దబోనాల బైపాస్‌రోడ్డుకు వెళ్లే దారిలోని ప్లాట్లు. రెండేళ్ల కిందట ఇక్కడ గజం ధర రూ.15వేలు ఉండేది. ఎకరం భూమి విలువ రూ.కోట్లలో ఉండేది. కానీ ఇప్పుడు కొనేవారు లేక.. ప్లాట్లు అమ్మకపోవడంతో ముందుగానే పెట్టుబడి పెట్టినవారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుపోయారు. సిరిసిల్ల మున్సిపల్‌లో విలీనమైన గ్రామాలను మళ్లీ గ్రామపంచాయతీలు చేస్తారనే ప్రకటనతో ఒక్కసారిగా భూముల ధరలు పడిపోయాయి. విలీన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ దందా వెనక్కి తగ్గింది.
ఇది సిరిసిల్ల శివారులోని శాంతినగర్‌లో మూడేళ్ల క్రితం వెలసిన రియల్ ఎస్టేట్ వెంచర్. దీన్ని డీటీసీపీ అఫ్రూవల్‌తో రోడ్డు వేసి, మౌలిక వసతులు కల్పించారు. భూపట్టాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారి సంయుక్త భాగస్వామ్యంతో వెంచర్ వెలసింది. ఇక్కడ ప్లాట్లు అమ్మకపోవడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి పెట్టిన పెట్టుబడి మీద పడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్లాటు కొనేందుకు ఏడాదిన్నరగా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.
ఇది వేములవాడ అర్బన్ మండల శివారులోని తిప్పాపూర్– జయవరం రోడ్డు పక్కన వ్యవసాయ భూమి. ఇక్కడ రెండేళ్ల కిందట ఎకరం వ్యవసాయ భూమి రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు పలికింది. కానీ ఇప్పుడు కొనేవారు లేక.. వ్యవసాయ భూములు మూలనపడ్డాయి. నిజానికి వ్యవసాయ భూములకు ఎప్పుడూ ధర ఉంటుంది. కానీ ఈ ఏడాదిన్నరగా వ్యవసాయ భూముల ధరల పెరగకపోవగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో అమ్మే వారే తప్ప కొనేవారు లేక వ్యవసాయ భూముల విక్రయాలు పడిపోయాయి.

రియల్ ఢమాల్

రియల్ ఢమాల్

రియల్ ఢమాల్