
రండి ‘నులి’పేద్దాం
● నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
సిరిసిల్ల: కంటికి కనిపించని నులిపురుగులు పిల్లలను బలహీనపరుస్తాయి. ఇది పిల్లల రక్తహీనతకు, అజీర్తి, వాంతులు, విరోచనాలకు కారణమవుతుంటాయి. ఏడాది వయసు పిల్లల నుంచి 19 ఏళ్ల యువకుల వరకు కడుపులో పెరిగే నులిపురుగులు పీల్చి పిప్పి చేస్తుంటాయి. బడికెళ్లేందుకు సిద్ధమైన పిల్లలు అప్పుడే కడుపునొప్పి అంటూ తల్లడిల్లిపోతుంటారు. నులిపురుగుల నివారణకు ప్రభుత్వం ఏటా రెండు సార్లు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం నులి పురుగుల నిర్మూలనకు మాత్రలు వేస్తున్నారు.
నులిపురుగుల్లో రకాలు
కడుపులో పెరిగే నులిపురుగుల్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో బద్దె, నట్టలు, కొంకి, కొరడా, ఏలిక పాములు, దారపు, నీరుగడ్డ వంటి రకాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా చిన్నారుల పొట్టల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కలుషిత ఆహారం తినడం, ఈగలు వాలుతూ దుమ్ముధూళి పడిన పదార్థాలు తినడం, పిల్లలు మట్టిలో పాదరక్షలు లేకుండా ఆడుకున్నప్పుడు, చేతులు కడుక్కోవడం మరిచిపోయినప్పుడు, ఆకుకూరలు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడుగకపోవడం, తినే ముందు, తిన్న తరువాత చేతులను శుభ్రంగా కడుగకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడంతో వంటి కారణాలతో నులిపురుగుల లార్వాలు జీర్ణకోశంలోకి ప్రవేశిస్తాయి. పేగు పురుగులు గుడ్లు శరీరంలో పెరిగి అనారోగ్యం కలిగిస్తాయి.
ఏం జరుగుతుంది
నులిపురుగులు కడుపులో చేరడంతో కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, ఆకలి లేకపోవడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన సమస్య, బరువు తగ్గడం, చదువు పై ఏకాగ్రత లేకపోవడం, ఎదుగుదల తగ్గడం, మలంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణ చర్యలు
భోజనానికి ముందు, ఆటలు ఆడిన తరువాత, మలవిసర్జన తరువాత కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రతను పాటించడంతోపాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. తీపి పదార్ధాలు పిల్లలకు దూరంగా ఉంచాలి. మలబద్ధకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
మాత్రలు వాడే విధానం
మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి. అనారోగ్యంగా ఉన్న వారు పూర్తిగా కోలుకున్న తరువాతే మాత్రలు వేసుకోవాలి. పుట్టుకతో గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారికి, ఉదర సంబంధ కేన్సర్ ఉన్న వారికి, కాలేయ వ్యాధిగ్రస్తులకు ఈ మాత్రలు వేయవద్దు. ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం గోళీ, రెండు నుంచి మూడేళ్ల పిల్లలకు ఒక్క మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలి. 3 నుంచి 19 ఏళ్లలోపు వారికి గోలిని నమిలిమింగేలా చూడాలి.
జిల్లాలో మాత్రల పంపిణీ
గ్రామాలు : 260
మున్సిపాలిటీలు : సిరిసిల్ల, వేములవాడ
అంగన్‌వాడీ కేంద్రాలు : 587
పిల్లలు : 30,475
పాఠశాలలు : 626
పిల్లలు : 77,921
జూనియర్ కాలేజీలు : 47
పిల్లలు : 7,664
మాత్రలు వేసే సిబ్బంది : 168
సహాయక ఆశవర్కర్లు : 456
తప్పనిసరిగా వేసుకోవాలి
నులిపురుగు నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాలతో జిల్లాలో మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేశాం. సోమవారం జిల్లా అంతటా వైద్యసిబ్బంది మాత్రలు వేస్తారు. ఎవరైనా మిగిలిపోతే ఈనెల 18న(సోమవారం) మ్యాప్ డే నాడు మాత్రలు ఇస్తాం. అపోహలకు పోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు నులి పురుగు నివారణ మాత్రలు వేయించాలి.
– డాక్టర్ ఎస్.రజిత, జిల్లా వైద్యాధికారి

రండి ‘నులి’పేద్దాం