
దంచికొట్టిన వాన
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచే ముసురు మొదలై.. క్రమంగా పెరిగింది. సిరిసిల్లలోని పాతబస్టాండు నేతన్నచౌక్ వద్ద వరద నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సంజీవయ్యనగర్ రోడ్డు వరదతో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో అత్యధికంగా ఇల్లంతకుంటలో 61.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రంగిలో 23.4, చందుర్తిలో 24.0, వేములవాడ రూరల్‌లో 1.9, బోయినపల్లిలో 5.5, వేములవాడలో 9.8, సిరిసిల్లలో 29.4, కోనరావుపేటలో 3.2, వీర్నపల్లిలో 4.4, ఎల్లారెడ్డిపేటలో 15.7, గంభీరావుపేటలో 58.3, ముస్తాబాద్‌లో 50.5, తంగళ్లపల్లిలో 27.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
పొంగిపొర్లుతున్న అంపు ఒర్రె
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని తాళ్లపల్లి, బెజ్జంకి మండలం గూడెం గ్రామాల మధ్య ఉన్న అంపు ఒర్రె పొంగి ప్రవహిస్తోంది. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా వర్షాలు బెజ్జంకి మండలం ప్రాంతంలో కురువడంతో ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లి చెరువు నిండి మత్తడి దుంకుతోంది. చెరువు నీటితోపాటు తాళ్లపల్లి గ్రామ పొలాల నీరు ఈ ఒర్రె గుండా ప్రవహిస్తోంది. ఇల్లంతకుంట నుంచి బెజ్జంకి మండలం గూడెం, బేగంపేట, కాసీంపేట, గుండ్లపల్లి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లాలంటే దగ్గర దారి ఇది. తాళ్లపల్లి, గాలిపల్లి రైతులు తమ పొలాల వద్దకు ఈ ఒర్రె దాటి వెళ్లాల్సిందే. ఒర్రైపె బ్రిడ్జి నిర్మించకపోవడంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆదివారం వరద పారడంతో కాసీంపేట మానసదేవీ ఆలయానికి వెళ్లే భక్తులు వెనుదిరిగారు.
ఇళ్ల చుట్టూ చేరిన వర్షపు నీరు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని గండిలచ్చపేట పరిధిలో ప్రభుత్వ పాఠశాల సమీపంలోని లోతట్టు ప్రాంతంలోని నివాసాలను వరదనీరు చుట్టుముట్టింది. ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణను శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా లోతట్టు ప్రాంతంలో ఉండడంతో వర్షపు నీరు వచ్చిందన్నారు. బాధిత కుటుంబానికి గ్రామంలోని మహిళా సంఘం భవనంలో తాత్కాళిక వసతి ఏర్పాటు చేసేందుకు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిపారు.
పొంగిపొర్లిన వాగులు, వంకలు
ఇల్లంతకుంటలో అత్యధికంగా 61.1 మిల్లీమీటర్లు

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన